1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఫ్లాష్ బ్యాక్ 2019
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 డిశెంబరు 2019 (17:09 IST)

అగ్రస్థానంతో ముగించిన విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీకి 2019 సంవత్సరం బాగా కలిసివచ్చిందని చెప్పొచ్చు. ఏ క్రికెటర్‌కు సాధ్యంకానిది కోహ్లీకే సాధ్యమైంది. అదే... మూడు ఫార్మెట్‌లలో రాణించడ. వన్డే, ట్వంటీ20, టెస్టుల్లో రాణిస్తూ, పరుగుల వరద పారిస్తున్న ఏకైక క్రికెటర్ కోహ్లీ కావడం గమనార్హం. ఫలితంగానే ఈ యేడాదిని కోహ్లీ అగ్రస్థానంతో ముగించాడు.
 
వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచిన విరాట్‌ టెస్టుల్లో 928 పాయింట్లతో మొదటి స్థానంతో 2019కి వీడ్కోలు పలుకనున్నాడు. ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. భారత టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే ఒక స్థానం కోల్పోయి ఏడో స్థానానికి పరిమితమయ్యాడు. 
 
ఇకపోతే, టాప్‌-10లో భారత్‌ నుంచి వీరిద్దరితో పాటు పుజారా (4వ స్థానం) కూడా ఉన్నాడు. లంకతో సిరీస్‌లో అదరగొట్టిన పాకిస్థాన్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ కెరీర్‌ అత్యుత్తమ ఆరో ప్లేస్‌కు చేరాడు. మయాంక్‌ అగర్వాల్‌ 12వ, రోహిత్‌ శర్మ 15వ స్థానాల్లో నిలిచారు. గత కొంత కాలంగా గ్రౌండ్‌కు దూరంగా ఉన్న భారత ఏస్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఆరో స్థానంలోనే ఉండగా.. ఆసీస్‌ స్టార్‌ పాట్‌ కమిన్స్‌ టాప్‌లో కొనసాగుతున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్‌ 360 పాయింట్లతో శిఖరాన నిలిస్తే.. ఆస్ట్రేలియా (216), పాకిస్థాన్‌ (80), శ్రీలంక (80), న్యూజిలాండ్‌ (60), ఇంగ్లండ్‌ (56) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
 
అలాగే, ఈ దశాబ్దపు ఉత్తమ జట్లను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇందులో దశాబ్ద కాలంగా మైదానంలో దుమ్మురేపుతున్న విరాట్ కోహ్లీతో పాటు.. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చోటుదక్కింది. గత పదేండ్ల ప్రదర్శన ఆధారంగా క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) అధికారిక వెబ్‌సైట్‌ ప్రకటించిన ఈ దశాబ్దపు టెస్టు జట్టుకు కోహ్లీ, వన్డే జట్టుకు ధోనీ కెప్టెన్‌లుగా ఎంపికయ్యారు. టెస్టు జట్టులో భారత్‌ నుంచి విరాట్‌ మాత్రమే చోటు దక్కించుకున్నాడు.