శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్ కుమార్
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (17:36 IST)

ద్రాక్షరసం తాగితే... ఎంత మేలో తెలుసా?

పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని మనకు తెలుసు. రకరకాల పండ్లలో రకరకాల పోషకాలు ఉంటాయి. అవి అనేక వ్యాధుల నుండి విముక్తిని కలిగిస్తాయి. అలాగే ద్రాక్ష పండ్లలో కూడా పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి.


ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలని నిర్మూలించడంలో ద్రాక్ష పండు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ద్రాక్ష రసంతో ఆరోగ్యం మాత్రమే కాక చర్మ సౌందర్యం కూడా మన సొంతం అవుతుంది. ఒక గ్లాసు ద్రాక్ష రసం త్రాగడం వల్ల ఒక అందమైన, ప్రకాశవంతమైన చర్మం సహజసిద్ధంగా లభిస్తుంది.
 
ద్రాక్షలో విటమిన్ సి, ఎ, బి6, ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం లాంటి ఎన్నో రకాల ఖనిజ లవణాలు ద్రాక్షలో సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు ఇందులోని ఫ్లేవనాయిడ్స్ లాంటి శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. 
 
ద్రాక్షలో ఉండే ఔషధ గుణాలు ఆస్తమాను అదుపులో ఉంచేందుకు సహాయపడతాయి. ద్రాక్షపండ్లలో టీరోస్టిల్‌బీన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదును తగ్గిస్తుంది. ద్రాక్ష పొట్టులో ఉండే సెపోనిన్లు కొలెస్ట్రాల్‌కు అతుక్కుని దాన్ని శరీరం గ్రహించకుండా నివారిస్తాయి. నల్లద్రాక్షల రసం రొమ్ము క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది. క్యాన్సర్ కణాల వ్యాప్తిని కూడా అరికడుతుంది. ద్రాక్షలోని ఈ పదార్థాలు మొత్తం శరీర వ్యాధి నిరోధక వ్యవస్థనే బలోపేతం చేస్తాయి.
 
 ఒక గ్లాసు తాజా ద్రాక్షరసాన్ని ప్రతి రోజూ త్రాగడం వల్ల అసిడిటీ సమస్య తగ్గుతుంది. తిన్న ఆహారం అరగకుండా అజీర్ణంతో బాధపడుతున్నవారు ద్రాక్ష రాసాన్ని కానీ లేదా ద్రాక్షపండ్లను కానీ తీసుకోవడం వల్ల అజీర్తి నుండి బయటపడవచ్చు. ద్రాక్షలో సెల్యులోజ్, ఆర్గానిక్ ఆసిడ్ మరియు షుగర్ వంటివి మలబద్దకాన్ని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
 
ద్రాక్ష రసం కడుపులోని ప్రేగులను శుభ్రపరచడంతో పాటు దీర్ఘకాలంగా ఉన్న మలబద్దక సమస్యను నివారిస్తుంది. చర్మ సంరక్షణకు ద్రాక్ష పండ్లు ఎంతగానో ఉపకరిస్తాయి. అందుకే వీటిని స్క్రబ్‌, మాయిశ్చరైజర్‌ తయారీలో ఉపయోగిస్తున్నారు. తాజా ద్రాక్షలను గుజ్జులా చేసి మసాజ్‌ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.