మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (18:01 IST)

చికెన్ తింటే వేడి చేస్తుందా? అదీ వేసవిలో తినొచ్చా?

మాంసాహారులలో ఎక్కువ మంది తినేది చికెన్. చాలా చౌక ధరకు లభించే నాన్ వెజ్ ఐటెమ్ ఇది. చికెన్ తినేవారిలో కొన్ని సందేహాలు ఉన్నాయి. చికెన్ తింటే వేడి చేస్తుందని వారి నమ్మకం. వేసవి కాలంలో అలాంటి వారు దానిని తినడం మానేస్తారు. నిజంగా చికెన్ తింటే వేడి చేస్తుందో లేదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 
 
చికెన్‌లో ప్రోటీన్ ఉంటుంది. అది మన శరీరానికి బలాన్ని ఇస్తుంది. అందుకే బాడీబిల్డర్లు వెనుకాడకుండా చికెన్ తింటారు. కానీ ప్రొటీన్ అంత తేలికగా జీర్ణం కాదు. దానిని జీర్ణం చేయాలంటే శరీరం అదనపు శక్తిని కూడదీసుకుని మెటబాలిజం రేట్‌ని వేగవంతం చేయాలి. అంటే జీర్ణం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలి. అందుకే ప్రొటీన్ గల ఆహారం ఎక్కువగా తీసుకుంటే మెటబాలిజం రేట్‌ని పెంచే క్రమంలో శరీర ఉష్ణం పెరుగుతుంది. అంటే చికెన్ తిన్నా కూడా వేడి పెరుగుతుంది. 
 
దీని వెనుక ఉన్న అసలు కారణం ఇదే. కానీ వ్యాయామం చేసి బాడీ బిల్డింగ్ చేసే వాళ్లు చికెన్, గుడ్లు మానేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల శరీరంలో వేడి తగ్గుతూనే ఉంటుంది. 
 
ప్రొటీన్ తీసుకునే వాళ్లు వర్క్‌అవుట్ చేయడం ముఖ్యం. ప్రొటీన్ అవసరమైన వాళ్లు మాంసం ద్వారా తీసుకుంటారా, పౌడర్ ద్వారా తీసుకుంటారా లేక ప్లాంట్ ప్రొటీన్ పైనే ఆధారపడతారా వాళ్ల ఇష్టం. కానీ వేడి చేస్తుందని భయం ఉన్న వాళ్లు ప్రక్కన పెట్టవలసింది చికెన్, గుడ్లు మాత్రమే కాదు. కారం ఎక్కువగా తినకూడదు, మసాలా వంటలకు దూరంగా ఉండాలి. వ్యాయామం చేయకపోయినా మితంగా ప్రొటీన్ తీసుకుంటూనే ఉండవచ్చు.