అచ్చ తెలుగు ఆహార పండుగ... బొంగు బిర్యానీ, బొంగు చికెన్(ఫోటోలు)
పోషక విలువలతో కూడిన పసందైన విందుకు సచివాలయం వేదిక కాబోతుంది. తెలుగునాట సుప్రసిద్ధ వంటకాలుగా చరిత్రను ఆపాదించుకున్న వంటకాలను రాష్ట్రాధినేత చంద్రబాబు నాయిడు మొదలు, అమాత్యులు, అధికారులు రుచి
పోషక విలువలతో కూడిన పసందైన విందుకు సచివాలయం వేదిక కాబోతుంది. తెలుగునాట సుప్రసిద్ధ వంటకాలుగా చరిత్రను ఆపాదించుకున్న వంటకాలను రాష్ట్రాధినేత చంద్రబాబు నాయిడు మొదలు, అమాత్యులు, అధికారులు రుచి చూడనున్నారు. తెలుగుదనం ప్రతిబింబించే వంటకాలను మరింతగా జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లేలా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం గురువారం సాయంత్రం జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా భిన్న రకాల వంటకాలను ఆహార ప్రియులు స్వాగతిస్తున్నా, పోషక విలువల పరంగా ఆంధ్రప్రదేశ్ వంటకాలు విభిన్నమైనవి.
మనం సక్రమమైన ఆరోగ్యంతో ఉండటానికి ఏ ఆహార పదార్థాలను ఏ మేర తీసుకోవాలన్నది కీలకం కాగా, మన వంటకాలలో ఈ తరహా ప్రత్యేకతలకు కొదవలేదు. ఈ అంశాన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావటమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర పర్యాటక శాఖ ఈ వినూత్న కార్యక్రమాన్ని తీసుకుంది. పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా బాధ్యతలు చేపట్టిన తదుపరి పర్యాటక శాఖ పరంగా వివిధ పనులు వేగం అందుకోగా, సిఎం సూచనల మేరకు ఈ తెలుగు పోషకాహార పండుగను చేపడుతున్నారు.
మన జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనానికి నాంది పలకవచ్చు. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామాలతో పాటు పోషక విలువల భరితమైన ఆహారం ఎంతో మేలు చేస్తోంది. ఏయే పదార్థాలు తినడం మంచిది? వాటిలో రోగనిరోధకశక్తిని పెంచే గుణాలు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరం. తెలుగు సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న మన ఆహారంలో ఇవి ఏమేరకు ఉన్నాయన్నది చాలా కొద్దిమందికే తెలుసు. ఈ లోటును భర్తీచేస్తూ తేటతెలుగు వంటకాల విశిష్టతను వివరించేలా పర్యాటక శాఖ ఈ వినూత్న కార్యక్రమానికి నాంది పలికింది.
శాఖాహారం కావచ్చు, మాంసాహారం కావచ్చు... రాష్ట్ర ప్రజలకు ప్రీతిపాత్రమైన వంటకాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని బహుళ ప్రాచుర్యం పొందినవి కాగా, మరికొన్ని అంతగా పర్యాటకుల దృష్టిని ఆకర్షించలేక పోయాయి. ఈ లోటును భర్తీ చేయాలన్నదే పర్యాటక శాఖ ఉద్దేశ్యం అంటున్నారు ఆశాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా. మన వంటకాలు, షోషక విలువలతో కూడిన పూర్తి స్ధాయి సమాచారానికి పుస్తక రూపం కల్పించామని దీనిని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారని వివరించారు. పోషక విలువలతో కూడిన తెలుగు వంటకాలను ప్రపంచ పర్యాటకులకు చేరువ చేసే క్రమంలో ఇది తొలి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో ఈ తరహా ఆహార పండుగలను జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో చేపడతామన్నారు.
పర్యాటక శాఖ నిర్వహించే ఈ ఆహార వేడుకలో తెలుగుదనం ప్రతిబింబించే ముంత మసాలా రుచి చూడవచ్చు. ఇది దేశంలో మరెక్కడా కనిపించక పోవచ్చు. నెల్లూరు వడ, కొబ్బరి కుడుములు, కీరా వడ, అల్లం పెసరట్టు ఇలా చెప్పుకుంటూ పోతే అల్పాహార విభాగంలో మన రుచుల తీరే వేరు. శాఖాహారంలో దొండకాయ కొబ్బరి కూర రుచి చూస్తే వదిలిపెట్టరెవ్వరూ. తెలగపిండి, మునగాకు తాలింపు మజానే వేరు. మునగాకు పువ్వు కూర గురించి తెలిసిన వారు తక్కువనే చెప్పాలి. ఆయుర్వేద విలువల భరితం ఇది. కాకరకాయ ఉల్లికారం రుచి చూస్తే మళ్లీమళ్లీ నోరూరవలసిందే.
అరటిపువ్వు కాంబినేషన్‌లో చేసే పెసరకూర రుచి తింటే కాని అర్ధం కాదు. అందరికీ తెలిసిన గుత్తి వంకాయ కమ్మదనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇక ఉలవచారు మీగడతో రెండు ముద్దలు తిన్నా చాలన్నది తెలుగునాట వినిపించే మాట. చింతచిగురు పప్పు, తోటకూర పప్పు, ఆనపకాయ పప్పు, ముక్కల పులుసు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు పొదిగిన ఆహారం తెలుగు వారిది. ఇక దంపుడు బియ్యం, పెసరమొలకల పలావ్ తింటే ఏ పరదేశీ అయినా ఇక్కడి పౌరసత్వం తీసుకోవాలసిందే.
మెంతికూర టమోటా అన్నం, పుల్లట్లు, రాగిముద్ద, పన్నీరు గంటి కుడుములు గ్రామీణాంధ్రలో కనిపించే విశేష వంటకాలు. శాఖాహారంలో కనిపించే మరో అద్భుతమైన వంటకం బొంగు బిర్యాని. ఇక మాంసాహారం ముచ్చట చెప్పనక్కర లేదు. కొత్తిమీర కోడి మసాలా వాసనకే కడుపు నిండిపోతుంది. బొంగు చికెన్, గోంగూర మాంసం, దోసకాయ మాంసం రుచులు అంతర్జాతీయ పర్యాటకులకు చేరువ అయితే వీటి కోసమే వారు మళ్లి, మళ్లి వస్తారన్నా ఎటువంటి ఆశ్చర్యం లేదు. మాంసాహార ప్రియులలో బీరకాయ రొయ్యల కూర, సొర పొట్టు కూరను స్వాగతించని వారే ఉండబోరు. తాటిబెల్లం ఉక్కరి రుచి చూడాలంటే ఎవరైనా తెలుగుదేశం రావలసిందే. ఒక కొబ్బరి మీగడ పాయసం గురించి ఎంత చెప్పినా తక్కవే.