లివర్ చెడిపోవడానికి కారణాలేంటి?
లివర్ మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. తిన్న ఆహారం జీర్ణం అవ్వాలన్నా, శరీరానికి శక్తి సరిగ్గా అందాలన్నా, విష పదార్థాలు బయటికి వెళ్లాలన్నా లివర్ సరిగ్గా పని చేయాలి. కానీ నేటి తరుణంలో మనం తింటున్న అనేక ఆహార పదార్థాలు, పలు వ్యాధులు, అలవాట్లు లివర్ చెడిపోవడానికి కారణమవుతున్నాయి. లివర్ చెడిపోవడానికి గల కారణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చక్కెర లేదా తీపి అధికంగా ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల కాలేయం దెబ్బ తింటుంది. చక్కెరను అతిగా తింటే అది మొత్తం లివర్‌లోనే పేరుకుపోయి కొవ్వుగా మారుతుంది. దీంతో కొంత కాలానికి లివర్ పనితీరు మందగించి చెడిపోతుంది.
ఆహార పదార్థాలు రుచిగా ఉండటానికి వాటిలో మోనోసోడియం గ్లుటమేట్ అనే పదార్థాన్ని ఎక్కువగా కలుపుతున్నారు. ఈ పదార్థం ఉన్న ఆహారాన్ని తింటే, దీని ప్రభావం లివర్‌పై పడి చెడిపోతుంది. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల కూడా కాలేయం త్వరగా చెడిపోతుంది. కూల్‌డ్రింక్స్‌లో ఉండే రసాయన పదార్థాలు కాలేయాన్ని పని చేయకుండా చేస్తాయి. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ద్రవాల శాతం పెరుగుతుంది. దాంతో కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి.
ఉప్పు ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు కూడా వస్తుందనే విషయం తెలిసిందే. చిప్స్‌లో ఉండే విషపూరితమైన పదార్థాలు లివర్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కాబట్టి వాటికి కూడా దూరంగా ఉండటం మంచిది. స్థూలకాయం ఉన్నవారు కూడా లివర్ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతే ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చేందుకు అవకాశం ఉంది.
డయాబెటిస్ సమస్యతో బాధపడే వారికి లివర్ వ్యాధులు వచ్చే అవకాశం 50 శాతం వరకు ఉంటుంది. క్రిమి సంహారక మందులను వాడి పండించిన కూరగాయలు, పండ్లను తింటే వాటితోపాటు ఆ మందులు కూడా మన శరీరంలోకి వెళ్తాయి. అప్పుడు ఆ మందులు లివర్‌పై ప్రభావం చూపుతాయి. మద్యపానం, ధూమపానం ఎక్కువగా చేసే వారిలో కూడా లివర్ త్వరగా చెడిపోతుంది.