మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (21:17 IST)

అబ్బో... నడుము పగలగొట్టుకుపోతోంది... ఎలా తగ్గుతుంది?

ఇటీవలి కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో నడుము నొప్పి ఒకటి. ముఖ్యంగా గంటలకొద్దీ కుర్చీలకు అతుక్కుపోయి పని చేయాల్సి రావడం ఇంటికి వచ్చాక కూడా తీరిక లేని పని వుండటంతో నడుముపై అధిక భారం పడుతోంది. దీనితో నడుము నొప్పి సమస్య తలెత్తుతుంది.
 
నడుము నొప్పి ఎవరికి వచ్చే అవకాశం ఉంది ? 
కార్యాలయాల్లో ఎక్కువ సమయం సీటులోనే కూర్చుని పనిచేసే వారిలో ఇది ఎక్కవగా కనిపిస్తుంది. నడుముకు వెనుక సపోర్టు లేకపోవడం వలన ఆ ప్రాంతంపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా నొప్పి వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. ఇకపోతే అధిక బరువు ఉన్నవారిలో కూడా నడుం నొప్పి వస్తుంది. 
 
సాధారణంగా పొట్ట పరిమాణం పెరిగినప్పుడు నడిచే విధానంలోనూ, కూర్చునే విధానంలోనూ మార్పు వస్తుంది. ఈ ప్రభావం నడుంపై పడుతుంది. అప్పుడు కూడా నడుం నొప్పి వస్తుంది. ఇదిలా ఉండగా ఇందులో పలు రకాలు ఉన్నాయి. డిస్క్‌లో మార్పులు రావడం వలనా, వెన్నుపూసల మధ్య ఉంటే కీళ్ళలో డిజనరేటివ్ మార్పులు రావడం వలన నడుం నొప్పి వస్తుంటుంది. 
 
మామూలుగా శరీరంలోని ప్రతి అవయవానికి ఒక వ్యాయమం ఉంటుంది. అలాగే నడము భాగానికి కూడా వ్యాయామం అవసరం. నడుం సాధ్యమైనంత వరకూ మనం ముందుకే వంచుతుంటాం. తక్కువ సందర్భాలలో పక్కకు తిప్పుంటాం. వెనుకకు వంచడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇది అందరికి తెలిసిందే. 
 
నడుంకు అవసరమైన వ్యాయమం ఇవ్వకుండా గంటల తరబడి ఒకే స్థితిలో కూర్చోవడం వలన ఆయా ప్రాంతాల చుట్టు ఉన్న కండరాలు బిగుతుగా అవుతాయి. అందువలన నొప్పి వస్తుంది. 
 
నివారణ ఏమిటి? 
నడుం నొప్పికి మందులు, మాకులు తీసుకోవడం కంటే కాస్త వ్యాయామాలు చేయడం ఉత్తమం. నడక మంచి ఫలితాన్నిస్తుంది. కటిక నెలపై వెల్లకిలా పడుకుని శరీరానికి విశ్రాంతి నిస్తే కాస్త ఉపశమనం లభిస్తుంది. కొన్ని పద్దతులలో కాళ్ళకు బరువులు వేలాడదీసి వెన్ను పూసలోని మార్పులను సవరించడానికి చికిత్సా విధానం ఒకటి ఉంది. 
 
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే వీటన్నింటికంటే యోగాసనాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇందులో ప్రత్యేకించి మకరాసనం, సర్పాసనం, భుజంగాసనం,వజ్రాసనం, చక్రాసనం, శలాభాసనాలు నడుం నొప్పి నివారణకు దోహదపడుతాయి. నొప్పి ఎక్కువగా ఉంది కదానీ వెంటనే ఆసనాలకు వెళ్ళితే ప్రమాదం. మొదట నొప్పి తగ్గించుకోవడానికి కాస్త వేడినీళ్ళ కాపడం, చమురు మర్ధనా జరపాలి. తరువాతనే యోగాసనాలకు వెళ్ళాల్సి ఉంటుంది. మరో విషయమేమిటంటే యోగాలో ఆసనాలు వయసు మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఆసనాలు వేసే సమయంలో యోగా మాస్టరును సంప్రదించి వయసుకు తగ్గట్టుగా తెలిపిన వాటిలో ఏదోక ఆసనాన్ని ఎన్నుకోవాలి.