సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (20:49 IST)

రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడం కూడా కరోనా లక్షణమే?

కరోనా వైరస్ అంటేనే ప్రతి ఒక్కరూ భయంతో వణికిపోయే ప్రరిస్థితి ప్రస్తుతం దేశంలో నెలకొంది. దీనికి కారణం దేశంలో కరోనా రెండో దశ అల ఆ స్థాయిలో ప్రతాపం చూపిస్తోంది. ప్రతి రోజూ మూడున్నర లక్షల మంది ఈ వైరస్ బారినపడుతుంటే, రెండు వేలకు పైగా కరోనా రోగులు మృత్యువాతపడుతున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ఒక హృదయవిదాకరమైన, భయం వాతావరణం నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో కరోనా సోకిందని తెలుసుకునేందుకు వైద్యులు రకాల సూచనలు ఇచ్చారు. ఇపుడు మరొకటి వెల్లడించారు. తీవ్ర నీరసం, రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య ఒక్కసారిగా భారీగా తగ్గిపోవడం కూడా కరోనా ఇన్ఫెక్షన్‌ ప్రాథమిక లక్షణంగా భావించాల్సి ఉంటుందని ఉత్తరప్రదేశ్‌కు చెందిన పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 
ఇటీవల కాలంలో ఈ తరహా లక్షణాలతో తమ వద్దకు వచ్చిన ఎంతోమందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిందని వారు అంటున్నారు. తీవ్ర నీరసం, రక్తంలో ప్లేట్‌లెట్లు పడిపోవడాన్ని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకుంటే.. తర్వాతి దశలో జ్వరం, శ్వాస తీసుకునే సమస్యలు కూడా చుట్టుముడుతాయని హెచ్చరిస్తున్నారు. 
 
ఈ వైద్యుల కథనం ప్రకారం.. నీరసంగా అనిపించడంతో ఈనెల 18న ఓ వ్యక్తి రక్తపరీక్ష చేయించుకోగా ప్లేట్‌లెట్లు 4.5 లక్షల నుంచి 85 వేలకు తగ్గిపోయినట్లు గుర్తించారు. దీంతో వైద్యుడి రాసిచ్చిన మందులను వాడుతుండగా ఏప్రిల్‌ 23న శ్వాస సమస్య కూడా మొదలైంది. అనుమానంతో అతడు మరోసారి రక్తపరీక్ష చేయించుకోగా ప్లేట్‌లెట్లు 20 వేలకు పడిపోయినట్లు వెల్లడైంది. 
 
ఈ పరిణామంతో మేల్కొన్న బాధిత కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రుల్లో చేర్పించే ప్రయత్నం చేయగా.. ఆక్సిజన్‌ బెడ్లు లేవంటూ ఎక్కడా చేర్చుకోలేదు. ఇలా వైద్యసహాయం కోసం ఎదురుచూస్తూనే అతడు చనిపోయాడని కుటుంబీకులు బోరున విలపిస్తూ చెప్పారు.