షేవింగ్ బ్లేడ్‌తో సిజేరియన్.. తల్లీబిడ్డ మృతి.. ఎక్కడో తెలుసా?
గర్భిణీకి సిజేరియన్ ఆపరేషన్‌ను షేవింగ్ బ్లేడ్‌తో చేశాడు.. ఓ శారదా ఆస్పత్రి నిర్వాహకుడు. దీంతో తల్లీ బిడ్డ ప్రాణాలు కోల్పోయిన ఘటన యూపీలోని సుల్తాన్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుల్తాన్‌పూర్, సైని గ్రామంలోని మా శారదా ఆసుపత్రి నిర్వాహకుడు రాజేష్ సాహ్ని అనర్హులతో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నాడు. పూనం అనే నిండు గర్భిణీని డెలివరీ కోసం ఆమె కుటుంబ సభ్యులు ఆ క్లినిక్‌కు తీసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో 8వ తరగతి చదువును మధ్యలో ఆపేసి స్కూల్ మానేసిన రాజేంధ్ర శుక్లా అనే వ్యక్తి గడ్డం గీసుకునే బ్లేడ్‌తో ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో ఆ మహిళ చనిపోయింది. కొంతసేపటి తర్వాత బిడ్డ కూడా మరణించింది.
మహిళ భర్త రాజారామ్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్లినిక్‌లో ఎలాంటి వైద్య సదుపాయాలు లేవని, అనర్హులతో శాస్త్రచికిత్సలు చేసి రోగుల ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు.
దర్యాప్తు చేసిన పోలీసులు దీనిని నిర్ధారించుకున్నారు. రాజేంద్ర శుక్లాతోపాటు రాజేష్ సాహ్నిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అక్రమ క్లినిక్‌లపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని చీఫ్ మెడికల్ అధికారికి పోలీసులు లేఖ రాశారు.