అలా చేస్తే ఎయిడ్స్‌కు విరుగుడు...
ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్‌కు విరుగుడు కనిపెట్టారు. మూలకణ మార్పిడి (స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్) ద్వారా ఎయిడ్స్‌కు చెక్ పెట్టొచ్చని వైద్యులు అంటున్నారు. లండన్‌లో హెచ్‌ఐవీ వైరస్ సోకిన ఓ వ్యక్తికి మూలకణ మార్పిడి (స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్) ద్వారా ఈ వైరస్ నుంచి ఉపశమనం కలిగినట్లు తాజాగా వైద్యులు వెల్లడించారు.
ఈ పేషెంట్ 18 నెలలుగా అతడు ఎలాంటి హెచ్‌ఐవీ డ్రగ్స్ తీసుకోవడం లేదని, ఆ వైరస్ నుంచి చాలా వరకు ఉపశమనం లభించిందని డాక్టర్లు చెప్పారు. అయితే హెచ్‌ఐవీ నుంచి అతడు పూర్తిగా బయటపడినట్లే అని చెప్పడం కూడా సరికాదని అంటున్నారు. పైగా హెచ్‌ఐవీ సోకి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తుల్లో ఈ పద్ధతి పాటించడం కూడా ప్రమాదమేనని వారు చెబుతున్నారు.
ఈ లండన్ రోగికి గత 2003లో హెచ్.ఐ.వి. సోకింది. 2012లో కేన్సర్ బారిన పడ్డాడు. కేన్సర్ కోసం కీమోథెరపీ తీసుకున్నాడు. ఆ తర్వాత హెచ్‌ఐవీ వైరస్ నిరోధక శక్తి కలిగిన ఓ దాత నుంచి మూల కణాలను తీసుకొని ఆ పేషెంట్‌లోకి పంపించారు. దీంతో అతనికి కేన్సర్, హెచ్‌ఐవీల నుంచి ఒకేసారి ఉపశమనం లభించడం విశేషం. యూనివర్సిటీ కాలేజ్ లండన్, ఇంపీరియల్ కాలేజ్ లండన్, కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీల పరిశోధకులు ఈ కేసును అధ్యయనం చేశారు.