కివీ పండు తినేవారు తెలుసుకోవల్సిన విషయాలు
కివి పండు చూడటానికి ముదురు గోధుమరంగు నూగుతో కోడి గ్రుడ్డు ఆకారంలో వుండి, లోపల అనేక నల్లని గింజలతో నిండిన ఆకుపచ్చ లేదా లేత పసుపు పచ్చగుజ్జు కలిగి వుంటుంది. ఈ కివి పండు స్త్రీలు తింటుంటే ఎముక పుష్టి, రుతుక్రమ ఇబ్బందులు తొలగుతాయి. ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కమలాపండుకు రెట్టింపు విటమిన్ సి, ఆపిల్‌లో కన్నా అయిదు రెట్లు ఎక్కువ పోషకాలు కివి పండులో వున్నాయి.
కొవ్వులూ, సోడియం తక్కువగా ఉండటం వల్ల హృద్రోగులూ, మధుమేహ వ్యాధిగ్రస్తులూ కూడా దీన్ని తినొచ్చు. కివీ పండులోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల బీపీ, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. కివీ పండ్లు తింటే నేత్ర సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
క్యాన్సర్‌కు దారి తీసే జన్యు మార్పులను నిరోధించే పదార్థం కివీలలో ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఫైబర్ అధికంగా ఉండే కివీ పండు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. శ్వాస, ఆస్తమా వంటి సమస్యలను కివీ పండు తొలగిస్తుంది. గర్భిణీ స్త్రీలకు కివీ పండ్లను ఇస్తే మంచి పౌష్టికాహారం లభించడమే కాక బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది.