మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: సోమవారం, 6 నవంబరు 2017 (21:11 IST)

చల్లచల్లగా ఐస్ క్రీమ్ తినాలంటే బెంబేలు... తలబద్ధలైపోయే తలనొప్పి...

చల్లటి పదార్థాలు తినాలంటే చాలామంది బెంబేలెత్తిపోతుంటారు. ఎందుకంటే చల్లని పదార్థాలు తినగానే వారికి తల పగిలిపోయే తలనొప్పి స్టార్టవుతుంది. దీనికే బ్రెయిన్ ఫ్రీజ్ అనే పేరుంది. ఈ తరహా తలనొప్పి చాలామందిలో ఏదైనా చల్లటి పదార్థాలు తీసుకోగానే వస్తుంది. మరీ ముఖ

చల్లటి పదార్థాలు తినాలంటే చాలామంది బెంబేలెత్తిపోతుంటారు. ఎందుకంటే చల్లని పదార్థాలు తినగానే వారికి తల పగిలిపోయే తలనొప్పి స్టార్టవుతుంది. దీనికే బ్రెయిన్ ఫ్రీజ్ అనే పేరుంది. ఈ తరహా తలనొప్పి చాలామందిలో ఏదైనా చల్లటి పదార్థాలు తీసుకోగానే వస్తుంది. మరీ ముఖ్యంగా కొందరిలో ఐస్‌క్రీమ్ తిన్న తర్వాత అది నోటిలోని పైభాగాన్ని తగిలేలా కరుగుతూ పోయాక... కాసేపు తలనొప్పి వస్తుంటుంది. 
 
మరికొందరిలో చల్లటి పదార్థాలు లేదా పానీయాలు తాగాక వస్తుంది. అందుకే కోల్డ్ స్టిమ్యులస్ హెడేక్ అని పేరున్న దీన్ని ఐస్‌క్రీమ్ హెడేక్ అనడం కూడా కద్దు. మనం నోటిలోకి చల్లటి పదార్థాలను తీసకోగానే మన నోటి పైభాగంలోని అంగలిలో ఉండే రక్తనాళాలు ఒక్కసారిగా కుంచించుకుపోతాయి. ఆ తర్వాత నోటిలోని వేడి వల్ల మళ్లీ అవి వ్యాకోచం చెందగానే ఒక్కసారిగా ఆ రక్తనాళాల్లోకి రక్తం దూసుకొచ్చినట్లుగా అవుతుంది. ఫలితంగా మన నోట్లో ఐస్‌క్రీమ్‌ను పెట్టిన వైపు తలనొప్పి రావడం సహజం. ఇది చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే.
 
సాధారణంగా ఇలా వచ్చే తలనొప్పి దాదాపు పది లేదా ఇరవై సెకండ్లు మించదు. ఒక్కోసారి మహా అయితే కొద్ది నిమిషాలు అంతే. అయితే కొంతమందిలో కొన్నిసార్లు చల్లటిదేదైనా తిన్న తర్వాత వచ్చే ఈ తరహా తలనొప్పి ఎంతకూ తగ్గదు. ఇలాంటి తలనొప్పి చాలా బాధపెడుతుంది. దీన్ని నివారించడానికి చేయాల్సిందల్లా మనం ఏదైనా చల్లటివి తింటున్నప్పుడు వేగంగా తినకుండా నింపాదిగా తినాలి. ఒకవేళ ఈ ఐస్‌క్రీమ్ తలనొప్పి ఎంతకూ తగ్గకపోతే చల్లటివి తిన్న తర్వాత కాస్త ఎక్కువసేపు గ్యాప్ ఇచ్చి మనం ముందు తీసుకున్న పదార్థం కంటే కాస్త వేడిగా ఉన్న పానీయం ఏదైనా తాగితే సరి. అంటే వేడి వేడి 'టీ ' లాంటిదన్నమాట. ఒక వేళ టీ దొరకకపోతే కాస్త గోరువెచ్చటి నీళ్లు తాగినా సరిపోతుంది. అలా దాన్ని వదిలించుకోవచ్చు.