గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 13 జులై 2019 (21:18 IST)

నల్లమిరియాలు అలాంటి సమస్యలకు దివ్యౌషధం

వంటింట్లో లభించే వస్తువుల్లోనే ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగివున్నాయని నిపుణులు చెబుతున్నారు. తులసి, మారేడు తరహాలో నల్ల మిరియాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. 
 
నల్ల మిరియాలతో ముఖ్యంగా వర్షాకాలం వేధించే అనారోగ్యాలకు అడ్డుకట్ట వేయవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. జలుబు, దగ్గు, అజీర్తి, కండరాల నొప్పులకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. నల్ల మిరియాల్లో ఉండే యాంటీ మైక్రోబియల్ పదార్థాలు జలుబు కారక సూక్ష్మజీవులను సమర్థంగా ఎదుర్కొంటాయి. 
 
అంతేగాకుండా ఛాతీలో నెమ్మును తగ్గిస్తాయి. పైగా, వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభ్యమవుతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు కణ వినాశనాన్ని అరికడతాయి. తద్వారా క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి. ఔషధ విలువల రీత్యా ఇవి చర్మ సంరక్షణకు ఎంతగానో తోడ్పడతాయి. 
 
విటిలిగో వంటి చర్మవ్యాధులు సైతం నల్లమిరియాలతో తగ్గుముఖం పట్టాల్సిందే. మోకాళ్ళ వద్ద ఉండే కార్టిలేజ్ టిష్యూలో వాపును తగ్గిస్తాయి. జీర్ణక్రియ సాఫీ సాగేందుకు నల్లమిరియాలు తీసుకోవడం ఉత్తమం. తద్వారా జీర్ణ రసాల ఉత్పత్తి మెరుగువుతుంది. డయేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవచ్చు. నల్లమిరియాలను వంటకాల్లో వేయడం కంటే మెత్తగా పొడిలా తయారుచేసి వేడి పాలల్లో కలిపి తీసుకుంటే ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.