చలికాలంలో వేడి నీళ్లతో తలస్నానం చేస్తే...?
సాధారణంగా చలికాలంలో మనం జుట్టు గురించి అసలు పట్టించుకోము. దీనివలన జుట్టు చిట్లిపోయి, ఎరుపు రంగులోకి మారడం, జుట్టు రాలిపోవడం జరుగుతుంది. అలాకాకుండా ఉండాలంటే జుట్టు సంరక్షణకోసం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా సీజన్ మారితే శరీరంలో కూడా మార్పులు జరగడం సహజం. చలికాలంలో జుట్టు రాలిపోకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఎలాగో చూద్దాం.
1. చలికాలంలో తలస్నానం చేస్తే జుట్టు తడి ఆర్చుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి, పూర్తిగా డ్రై అయిన తర్వాత చిక్కు వదిలించుకోవాలి. తడి జుట్టు దువ్వడం వల్ల జుట్టు ఊడి పోతుంది. లేదా డ్యామేజ్ అవుతుంది. తడి జుట్టును ఆత్రంగా దువ్వితే జుట్టు ఎక్కువగా రాలే అవకాశం ఉంది.
2. చలికాలంలో ఓపెన్ హెయిర్‌తో బయట తిరగడం వల్ల జుట్టు ఎక్కువ చిక్కుబడుతుంది. ఈ చిక్కును విడిపించడానికి కష్టం అవుతుంది. బలవంతంగా దువ్వడం వల్ల జుట్టు ఊడి పోతుంది. డ్రైగా మారుతుంది. వారంలో రెండుసార్లకు మించి తలస్నానం చేయకూడదు.
3. మార్కెట్లో ఉండే కెమికల్ షాంపులను ఉపయోగించడం వల్ల తలలో దురద, చుండ్రు, డ్రైనెస్ మరింత పెరుగుతుంది. కాబట్టి చలికాలంలో నేచురల్ షాంపులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మంచిది. జుట్టు స్టైలింగ్, లేదా జుట్టు తడి ఆర్పుకోవడానికి హెయిర్ డ్రయ్యర్స్, రోలర్స్, కర్లింగ్ ప్రొడక్టస్ వంటి హీట్ కలిగించే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్‌ను ఉపయోగించకపోవడం మంచిది.
4. తలకు బాగా హాట్ వాటర్‌తో స్నానం చేయకూడదు. హాట్ వాటర్‌తో తలస్నానం వల్ల జుట్టు మరింత ఎక్కువ డ్రై అవుట్ చేస్తుంది. జుట్టు రాలిపోవడానికి దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడూ గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల డ్రైనెస్ తగ్గుతుంది. మాయిశ్చరైజర్ పెరుగుతుంది.
5. చలికాలంలో శిరోజాలకు ఎంత తరచుగా నూనె పెడితే అంత మంచిది. ఇది జుట్టులోని తేమ శాతం ఎక్కువ సమయం నిలచి ఉండటానికి సహాయపడుతుంది. అలాగే దువ్వుకోవడానికి ఉపయోగించే దువ్వెన కూడా సరియైనది ఎంచుకోవాలి. చలికాలంలో జుట్టు అట్టకట్టినట్లు మారుతుంది. అలాకాకుండా ఉండాలంటే రోజు నిద్రపోయే ముందు విటమిన్ ఇ ఉన్న నూనెను రాసుకోవాలి.
6. నిమ్మరసానికి కొద్దిగా పెరుగు కలిపి దానిని జుట్టుకు పట్టించి బాగా మర్ధన చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేయడం వలన చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా జుట్టురాలే సమస్య కూడా తగ్గుతుంది.