బ్రిట్నీ స్పియర్స్‌కు కోర్టులో ఎదురు దెబ్బ... గోప్యంగా బట్టలు మార్చుకునేందుకు?
పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌కు లాస్ ఏంజెల్స్ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తన తండ్రి నుంచి తనకు విముక్తి కలిగించాలని ఆమె అందరి హృదయాలను కలచివేసేలా వేడుకున్నప్పటికీ లాస్ ఏంజెల్స్ కోర్టు జడ్జి అందుకు తిరస్కరించారు. ఆమె కో-కన్జర్వేటర్ (సహ సంరక్షకుడు)గా ఆమె తండ్రి జేమీ స్పియర్స్‌ను తొలగించాలని ఆమె చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఆమె తరపున శామ్యూల్ డీ ఇంఘామ్-3 వాదనలు వినిపించారు.
బ్రిట్నీ స్పియర్స్ ఆస్తులు, వ్యక్తిగత సంరక్షకునిగా ఆమె తండ్రి జేమీ స్పియర్స్‌ను 2008లో నియమించారు. బెస్సెమెర్ ట్రస్ట్ కంపెనీ అనే ఆస్తులను నిర్వహించే సంస్థ గత ఏడాది ఆమె ఆస్తులకు కో కన్జర్వేటర్‌గా వచ్చింది.
బ్రిట్నీ స్పియర్స్ జూన్ 23న కోర్టుకు వర్చువల్ విధానంలో స్టేట్‌మెంట్ ఇచ్చారు. తన తండ్రిపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తనను వేధించి, సాధించే నియంత్రణను ఆయన ప్రేమిస్తున్నాడని వాపోయారు. గోప్యంగా బట్టలు మార్చుకునేందుకు కూడా తనకు అవకాశం ఇవ్వలేదన్నారు.