శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (16:24 IST)

వేసవిలో ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలి?

ఈ యేడాది ఏప్రిల్ నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. భానుడి దెబ్బకు పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎండ వేడిమిని, వేసవి తాపాన్ని తట్టుకోలేక అనేక మంది చల్లని ఆహార పదార్థాలను ఆరగించేందుకు, సేవించేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
 
అయితే, వేసవి కాలంలో ఎలాంటి అనారోగ్యంబారినపడుకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కాస్తంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా, వేసవితాపం, డీహైడ్రేషన్ బారినపడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. 
 
ముఖ్యంగా ఎండాకాలంలో తీసుకునే ఆహారంపై దృష్టిసారిస్తే.. చలువ చేయడంతోపాటు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. వేసవిలో ముఖ్యంగా వేడి ఉత్పన్నమయ్యే ఆహారానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా, మాంసాహార పదార్థాలకు దూరంగా ఉంటే ఎంతో మంచిది.
 
మాంసంలో ప్రోటీన్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి. అందువల్ల దీనికి దూరంగా ఉండాలి. రెడ్ మీట్ జీర్ణ వ్యవస్థకు విఘాతం కల్గిస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో దీనికి దూరంగా ఉంటే.. ఉదర సమస్యలు కూడా తలెత్తవు. దీంతోపాటు మసాలా, కారం లాంటి పదార్థాలను తినకూడదు.
 
వేపుళ్లకు దూరంగా ఉండాలి. వాటిని తినడం వల్ల కడుపు ఉబ్బినట్లు, నిండినట్లు అనిపిస్తుంది. తరచూ దప్పిక అవుతుంటుంది. ఇది జీర్ణ ప్రక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. దీంతోపాటు టీ, కాఫీ వంటివి కూడా తాగకూడదు. వాటికి బదులుగా నిమ్మరసం, జీలకర్ర నీరు, మజ్జిగ, లస్సీ మొదలైనవి తీసుకుంటే మంచిది.
 
వేసవి కాలంలో ఎక్కువగా మామిడి పండ్లను తినేందుకు ఇష్టపడుతారు. ఎందుకంటే.. ఈ సీజన్‌లోనే ఈ రుచికరమైన పండ్లు ఎక్కువగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. కానీ శరీరంలో వేడిని బాగా పెంచుతాయి. దీనివల్ల జీర్ణ ప్రక్రియ ఎక్కువగా ప్రభావితం అవుతుంది.
 
వేసవి కాలంలో చల్లటి నీటిని తాగడం మానుకోవాలి. కూలింగ్ వాటర్ వల్ల మన దాహం తీరుతుందేమో కానీ.. చాలా వేడి ఉత్పన్నమవుతుందని పేర్కొంటున్నారు. సాధ్యమైనంత వరకూ రిఫ్రిజిరేటర్‌లోని నీటికి దూరంగా ఉంటూ.. కుండలోని నీటిని తాగాలని సూచిస్తున్నారు.