గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2023 (12:09 IST)

ప్రపంచ రికార్డు కోసం 104 యేళ్లయ వయసులో స్కై డైవింగ్

ప్రపంచ రికార్డు నెలకొల్పాలన్నపట్టుదలతో 104 యేళ్ల వృద్ధురాలు పెద్ద సాహసమే చేశారు. నిపుణుల పర్యవేక్షణలో 4100 అడుగులు ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేశారు. ఆదివారం చికాగోలో జరిగిన ఈ సాహస కార్యక్రమం వివరాలను పరిశీలిస్తే, 
 
అమెరికాకు చెందిన డొరొతీ హాఫ్మన్ అనే వృద్ధురాలు 104 ఏళ్ల వయసులో స్కెడైవింగ్ చేశారు. నిపుణుడైన మరో స్కెడైవర్‌తో కలిసి ఆమె విమానం 4,100 మీటర్ల ఎత్తున ఉండగా టాండమ్ జంప్ చేసి, దిగ్విజయంగా స్కెడైవ్ పూర్తి చేశారు. ఆ తర్వాత డొరొతీ చిరునవ్వులు చిందిస్తూ అక్కడున్న వారికి అభివాదం చేశారు. వయసంటే కేవలం ఓ సంఖ్య మాత్రమేనని, దానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని డొరొతీ చెప్పుకొచ్చారు.
 
చికాగోకు చెందిన డొరొతీ 100 ఏళ్లు వయసులో తొలిసారిగా స్కెడైవింగ్‌కు ప్రయత్నించారు. అప్పట్లో విమానం నుంచి కిందకు దూకేందుకు ఆమె సంకోచించడంతో వెనకున్న ఇన్‌స్ట్రక్టర్ ఆమెకు ధైర్యం చెప్పి ముందుకు తోయాల్సి వచ్చింది. కానీ ఆదివారం ఆమె అత్యంత ధైర్యసాహాలు ప్రదర్శిస్తూ చొరవతో తనే ముందడుగు వేశారు. తన వాకర్‌ను పక్కన పెట్టి విమానం డోరు వైపు నడిచారు. 
 
తలుపు తెరుచుకోగానే ఆమె.. నిపుణుడైన స్కై డైవర్‌తో కలిసి కిందకు దూకారు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకు అక్కడి పొలాల్లో దిగారు. మొత్తం ఏడు నిమిషాల్లో ఇదంతా పూర్తయ్యింది. స్కైడైవింగ్ చేసిన అత్యంత పెద్దవయసు వ్యక్తిగా ఈ ఫీట్తో తనకు రికార్డు దక్కుతుందని డొరొతీ ఆశాభావం వ్యక్తం చేశారు.