సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (17:22 IST)

ఆఫ్ఘన్ ప్రధాని సంచలన సందేశం: ఫేస్‌బుక్‌లో ఆ బాధ్యత తాలిబన్లదే?

Afghanistan PM
ఆఫ్ఘనిస్థాన్‌లో తీవ్ర సంక్షుభిత పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్నిరోజులుగా దేశంలోని ప్రధాన నగరాలన్నింటిని చేజిక్కించుకుంటూ వస్తున్న తాలిబాన్లు ఇవాళ రాజధాని కాబూల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతో ఆఫ్ఘన్ ప్రభుత్వం అధికారాన్ని తాలిబాన్లకు అప్పగించింది. ఆఫ్ఘన్ తాత్కాలిక అధిపతిగా అలీ అహ్మద్ జలాలీ నియమితులయ్యారు.
 
కాగా, కాబూల్‌ శాంతిభద్రతలపై ఆఫ్ఘన్ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను కాపాడాలని భద్రతా బలగాలను కోరారు. కాగా, అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆఫ్ఘన్‌ను విడిచి తజకిస్థాన్ లో ఆశ్రయం పొందినట్టు ఆఫ్ఘన్ హోంమంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.
 
 అప్ఘానిస్తాన్ గడ్డపై రక్తపాతాన్ని అడ్డుకునేందుకు తాను దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిందని అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ వెల్లడించారు. తాలిబన్లకు వ్యతిరేకంగా ప్రతిఘటించి ఉంటే రక్తపాతానికి దారితీసేదని అన్నారు. అందుకే దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టలేక తాను దేశం విడిచి వెళ్లినట్టు ఘనీ తన ఫేస్ బుక్ అకౌంట్లో ఈ విషయాన్ని ప్రకటించారు. తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడితే అనేక మంది దేశభక్తులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చేదని అన్నారు. అప్ఘాన్ తాలిబన్ల చేతుల్లో పెట్టి ఇక దేశ రక్షణ మీ బాధ్యతనేంటూ పరోక్షంగా పరాజయాన్ని అంగీకరించారు. ఆదివారం అప్ఘాన్ పూర్తిగా తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్ల దెబ్బకు ఘనీ పలాయనం చిత్తగించారు.
 
ఫేస్‌బుక్ సందేశంలో..
దేశ ప్రజలారా.. ఈరోజు నేను ఓ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. 20 ఏళ్లుగా రక్షించి నా దేశాన్ని వీడడం చాలా విచారకరం. అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు సాయుధ తాలిబన్లు దూసుకొస్తున్నాయి. నా ముందు రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి తాలిబన్లతో పోరాడి దేశకోసం ప్రజలంతా ప్రాణాలు త్యాగం చేయడం.. కాబూల్ నగరం విధ్వంసం అవ్వడం.. ఈ రెండు పరిణామాలు జరగడం నాకు ఇష్టం లేదు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టలేను. అందుకే దేశాన్ని తాలిబన్లకు అప్పగించి నేను అధ్యక్షుడిగా తప్పుకుంటున్నాను. తాలిబన్లు కూడా నన్ను దించేయాలని నిర్ణయించుకున్నారు. కాబుల్ సిటీని ధ్వంసం చేయాలనుకుంటున్నారు. ఈ రక్తపాతాన్ని నివారించడానికి నాకు ఈ మార్గం తప్ప మరొకటి కనిపించలేదు. అందుకే దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నాను అంటూ ఫేస్ బుక్ లో ఘనీ రాసుకొచ్చారు. అధ్యక్షుడు ఘనీ దేశాన్ని వీడటంతో తాలిబన్లు అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాంతో తాలిబన్ల విజయం అనివార్యమైంది.
 
దేశ ప్రజల అస్థిత్వాన్ని, గౌరవాన్ని సంపదను కాపాడాల్సిన బాధ్యత తాలిబన్లదేనంటూ ఘనీ ఆకాంక్షించారు. అప్ఘానిస్తాన్ పరువు ప్రతిష్ఠలను కాపాడతారా? లేదా అసాంఘిక శక్తులకు ఆశ్రయమిస్తారా? తెలియక అక్కడి ప్రజలందరూ భయాందోళనలో ఉన్నారు. తమ భవిష్యత్తుపై భరోసా లేక ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. అప్ఘాన్ ప్రజలతో పాటు వివిధ దేశాలకు తాలిబన్లు హామీ ఇవ్వాల్సి ఉంది. దేశ ప్రజల హృదయాలను చట్టబద్ధంగా గెల్చుకోవాలి. అప్ఘానిస్తాన్ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ అష్రాఫ్ ఘనీ ముగించారు.