శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జులై 2020 (12:31 IST)

ఇండియా బాటలో అమెరికా : చైనా యాప్స్‌పై నిషేధానికి చర్యలు?

గాల్వాన్ లోయ ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా యాప్స్‌పై భారత్ నిషేధం విధించింది. దీంతో డ్రాగన్ కంట్రీకి చెందిన అనేక కంపెనీలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయి. టిక్ టాక్‌తో సహా 59 యాప్స్‌పై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 
 
దేశ సార్వభౌమాధికారం, జాతీయ భద్రత, రక్షణ శాఖ రహస్యాలు, దేశ సమగ్రత వంటి అంశాలకు భంగం వాటిల్లుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమెరికా కూడా భారత్ బాటలో పయనించేలా ఉంది. 
 
తాజాగా, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్‌లను నిషేధించే అంశాన్ని తమ దేశం పరిశీలిస్తోందని స్పష్టం చేశారు.
 
కాగా, చైనాకు చెందిన ముఖ్యమైన 59 యాప్‌లపై భారత్ నిషేధం విధించడాన్ని ఇటీవలే అమెరికా ప్రశంసించిన విషయం తెలిసిందే. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతలకు ఈ చర్య దోహదపడుతుందని ఇటీవలే మైక్ పాంపియో వ్యాఖ్యానించారు. 
 
అమెరికాలోనూ టిక్ టాక్‌ను నిషేధించాలని తమ ప్రభుత్వానికి ఇటీవల జాతీయ భద్రతా సలహాదారులు సిఫార్సు చేశారు. ఇటువంటి యాప్‌ల ద్వారా చైనా ప్రభుత్వం అమెరికా పౌరుల డేటాను తస్కరిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అమెరికా కూడా చైనా యాప్స్‌పై కొరఢా ఝుళిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.