గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 జులై 2020 (12:19 IST)

అమెరికాను వణికిస్తున్న కరోనా వైరస్.. లక్షల్లో కేసులు, మృతులు

అమెరికాను కరోనా వైరస్ విజృంభిస్తోంది. అక్కడ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. మృతులు కూడా అదే స్థాయిలో వున్నాయి. అమెరికాలో  ప్రస్తుతం 130,284 మంది కరోనాతో మరణించారు. ఇది బ్రెజిల్‌లో మరణాల సంఖ్య కంటే రెండు రెట్లు అధికం. యూఎస్‌లో మొత్తం జనాభా 328 మిలియన్లు కాగా, బ్రెజిల్‌ జనాభా 210 మిలియన్లుగా ఉంది.
 
బ్రెజిల్ తరువాత యూకేలో 44,000 మందికి పైగా జనం కరోనాతో మరణించారు. ఇటలీలో ఇప్పటివరకు కేవలం 35,000 లోపు మాత్రమే మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం యూఎస్‌లో 29,35,712 కరోనా పాజిటివ్‌ కేసులున్నాయి. 
 
ఈ నేపథ్యంలో కరోనా విషయాన్ని దాచిపెట్టిన చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్ని తీవ్ర నష్టానికి గురిచేసిందని ట్రంప్ విరుచుకుపడ్డారు. వైరస్‌ అంశాన్ని రహస్యంగా ఉంచుతూ, తన మోసపూరిత చర్యలను కప్పిపుచ్చుకునేందుకు చైనా ప్రయత్నించడం వల్లే మహమ్మారి 189 దేశాలకు వ్యాపించిందని ఆరోపించారు. 
 
ఇందుకు చైనా తప్పక మూల్యం చెల్లిస్తుందన్నారు. అమెరికా 244వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఆయన మాట్లాడారు. మిగతా దేశాలతో పోలిస్తే, అమెరికాలోనే అత్యధిక, నాణ్యమైన కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. 
 
వైరస్‌ విలయానికి మూల కారణం చైనాయేనని మండిపడ్డారు. కాగా అమెరికాకు 244వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీకి బదులిస్తూ.. భారత్‌ను అమెరికా ఎప్పటికీ ప్రేమిస్తుందని ట్రంప్‌ పేర్కొనడం తెలిసిందే.