శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (20:05 IST)

చైనా ఉక్రోషం.... ఎందుకో తెలుసా?

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి భారత్‌ ఇటీవల చేసిన కీలక విధాన సవరణపై జన చైనా గుర్రుమంటోంది. సరిహద్దు దేశాలనుంచి వచ్చే ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేయడం, స్వేచ్ఛావాణిజ్య స్ఫూర్తికి విఘాతకరమని బీజింగ్‌ సుద్దులు చెబుతోంది.

దేశీయంగా బ్యాంకింగేతర రుణ సంస్థల్లో అతి పెద్దదైన హెచ్‌డీఎఫ్‌సీలో పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా (పీబీఓసీ) వాటా పెరిగిన దరిమిలా, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమది. వాస్తవానికి ఒక్క చైనాకే కాదు- నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, మియన్మార్‌, భూటాన్‌లకూ ఆ సవరణ వర్తిస్తుంది.

అయినా చైనాయే ఇంతగా ఎందుకు గొంతు చించుకుంటున్నదంటే, వ్యూహాత్మకంగా తన పట్టు పెంచుకోవాలన్న ఎత్తుగడను ఇండియా చిత్తుచేసిందన్న ఉక్రోషమే అందుకు కారణం! భారత్‌లోని 18 అగ్రశ్రేణి అంకుర సంస్థల్లో చైనానుంచి పెట్టుబడులు రూ.30వేల కోట్లకు పైబడినట్లు అంచనా.

బ్రూకింగ్స్‌ ఇండియా నివేదిక ప్రకారం- ఇక్కడ చరవాణులు, నిర్మాణ పరికరాలు మొదలు స్థిరాస్తి, ఆటొమొబైల్‌ వరకు ఎన్నో రంగాల్లో పలు చైనా సంస్థలు పెట్టుబడులు గుమ్మరిస్తున్నాయి. ఆ సంస్థల సంఖ్య ఎనిమిది వందలకు పైబడిందంటే, చైనా ఆధిపత్య వ్యూహం చాపకింద నీరులా ఎలా విస్తరిస్తున్నదో ఇట్టే బోధపడుతుంది.

బీజింగ్‌ ధోరణిని పసిగట్టిన జపాన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలతో పాటు స్పెయిన్‌, జర్మనీ వంటి ఐరోపా దేశాలూ ఎఫ్‌డీఐలపై నిషేధాంక్షలకు ఇప్పటికే పదునుపెట్టాయి. కొత్తగా ఆ శ్రేణిలోకి భారత్‌ సైతం చేరింది. తనకు మోకాలడ్డుతున్న దేశాల జాబితా విస్తరించే కొద్దీ చైనాలో తీవ్ర అసహనం ఎగదన్నుతోంది.

ఇండియా సహా తక్కిన దేశాల తీరు ప్రపంచ వాణిజ్య సంస్థ మార్గదర్శకాలకే విరుద్ధమన్న చైనా వ్యవహార సరళి- దయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉంది! కరోనా మహమ్మారి విజృంభణకు ప్రపంచ ఆర్థికం కుదేలై దేశాలెన్నో కిందుమీదులవుతున్న వేళ, చైనా తనదైన కుత్సిత క్రీడ కొనసాగిస్తోంది. అపార ఆర్థిక వనరులు, నేతాగణం రాజకీయదన్ను కలిగిన చైనా సంస్థలెన్నో- ఒడుదొడుకులతో చితికిపోతున్న విదేశాల్లో వాటాలు పెంచుకోవడానికి పోటీపడుతున్నాయి.

ఈ అవకాశవాద పెట్టుబడుల్ని అడ్డుకునే యత్నాలు చైనాకు కంటగింపవుతున్నాయి. స్వీయ ఆర్థిక ఆకాంక్షలు నెరవేర్చుకోవడంలో రాజీపడని, అలుపెరుగని బీజింగ్‌ బాణీ జగత్ప్రసిద్ధం. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) సభ్యత్వం పొందిన పందొమ్మిదేళ్ల తరవాతా కాపీరైట్స్‌, ట్రేడ్‌ మార్క్స్‌, ఇతరత్రా మేధాసంపత్తి హక్కుల పరిరక్షణలో చైనా అలవాటుగా విఫలమవుతూనే ఉంది.

చైనా వినియోగించే సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల్లో 70శాతం, పలు దేశాల్లో అది గుమ్మరించే రకరకాల చౌక ఉత్పాదనల్లో అత్యధికం నకిలీలన్న ఆరోపణలు ఏళ్ల తరబడి మోతెక్కుతున్నాయి. బాణసంచా మొదలు ఆటబొమ్మలదాకా చైనానుంచి పెద్దయెత్తున వచ్చిపడే చౌక సరకు భారత తయారీ రంగాన్ని దిమ్మెరపరుస్తుండటం- ఎటువంటి ఉన్నత వాణిజ్య విలువలకు సంకేతం?

ప్రపంచాన్ని గుప్పిట పట్టాలన్న తహతహతో రగిలిపోతున్న చైనా తానుగా డబ్ల్యూటీఓ నిబంధనల స్ఫూర్తికి లెక్కకు మిక్కిలి పర్యాయాలు తూట్లు పొడిచింది. నేడది ఉల్లంఘనలంటూ అడ్డగోలుగా ప్రస్తావిస్తున్నవి పసలేని వాదనలేనని నిపుణులెందరో తోసిపుచ్చుతున్నారు.

ఎఫ్‌డీఐలకు చెందిన నిబంధన డబ్ల్యూటీఓ పరిధిలో లేదని, పెట్టుబడులకు సంబంధించి భారత్‌ విధాన నిర్ణయంలో ఎటువంటి తప్పిదం చోటుచేసుకోలేదన్న విశ్లేషణలు చైనా ఆరోపణలకు గాలి తీసేస్తున్నాయి.