అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టులో ఊరట...
ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసుల విచారణను మూడు వారాల పాటు నిలిపివేసింది. పైగా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్, తెలంగాణ, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో నమోదైన కేసుల విచారణను నిలిపివేసింది. అలాగే, నాగ్‌పూర్‌లో నమోదైన కేసు విచారణను కూడా ముంబైకు బదిలీ చేసేందుకు సమ్మతించింది.
టీవీ షోలో విద్వేషపూరితంగా మాట్లాడారు. దీంతో ముంబైలో అర్నాబ్ దంపతులపై గుర్తుతెలియని దుండుగులు దాడికి పాల్పడ్డారు. అదేసమయంలో ఆయనపై వివిధ రాష్ట్రాల్లో ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అరెస్టు కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అయితే లాక్‌డౌన్ వేళ.. సుప్రీం కేవలం అత్యవసర కేసులను మాత్రమే విచారిస్తున్నది. శుక్రవారం కోర్టులో అర్నాబ్ తరపున సీనియర్ అడ్వకేటు ముఖుల్ రోహత్గీ వాదించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గోస్వామిపై కేసులు నమోదు అయినట్లు ఆయన కోర్టుకు వెల్లడించారు. టీవీ షోలకు ప్రతీకారంగా కేసులు వేసినట్లు చెప్పారు.
ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు జడ్జి డి.వై.చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కేసును పరిశీలించింది. ఈ మూడు వారాల వ్యవధిలో గోస్వామి .. యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పింది. నాగపూర్‌లో నమోదు అయిన కేసును ముంబైకి బదిలీ చేసేందుకు కూడా కోర్టు అంగీకరించింది.