బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 9 మే 2020 (21:55 IST)

కరోనాపై మూడు మందుల కాంబినేషన్ ప్రభావం!

అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ ను రూపుమాపేందుకు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వేల కోట్ల వ్యయంతో ప్రయోగశాలల్లో వ్యాక్సిన్లు, సమర్థ ఔషధాల కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హాంకాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు ఆసక్తికర అంశం వెల్లడించారు. మూడు రకాల మందుల కాంబినేషన్ ను కరోనా చికిత్సలో వాడితే, సత్ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు.
 
యాంటీ వైరల్ థెరపీలో భాగంగా కరోనా రోగులకు ఇంటర్ ఫెరాన్ బీటా-1బీతో పాటు లోపినవివర్-రిటోనవిర్, రైబావిరిన్ ఔషధాలను రెండు వారాల పాటు ఇచ్చినట్టయితే శరీరంలో వైరస్ ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్టు పరిశోధకులు తెలిపారు. కేవలం లోపినవిర్-రిటోనవిర్ మాత్రమే ఇచ్చినప్పుడు ఏమంత సమర్థంగా పనిచేయలేదని, ఇతర యాంటీ వైరల్ మందులు కూడా జతచేసినప్పుడు ఫలితాలు ఆశాజనకంగా వచ్చాయని హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన ఆ పరిశోధకులు వివరించారు.
 
సింగిల్ డ్రగ్ ట్రీట్ మెంట్ కంటే కాంబినేషన్ లో యాంటీవైరల్ డ్రగ్స్ ఇవ్వడం ద్వారా అధిక ప్రభావం కనిపిస్తోందని, అయితే, రోగులు కరోనా లక్షణాలు కనిపించిన వారంలోపే ఆసుపత్రిలో చేరినప్పుడే ఈ ట్రిపుల్ కాంబినేషన్ మందులు శక్తిమంతంగా పనిచేస్తాయని తెలిపారు.

ఈ మూడు మందుల వాడకంతో రోగులు ఎక్కువ రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం కూడా తగ్గుతుందని, వారిలో వైరల్ లోడ్ కొన్నిరోజుల్లోనే కనిష్ట స్థాయికి చేరుతుందని హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన క్వోక్ యుంగ్ యువెన్ వెల్లడించారు. ఈ విధమైన ట్రిపుల్ డ్రగ్ కాంబినేషన్ ను రోగులు బాగానే తట్టుకుంటారని, ఇది సురక్షితమైన వైద్య విధానం అని చెప్పారు.