బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 9 మే 2020 (21:49 IST)

కరోనా కొత్త లక్షణాలపై మరో సంచలన విషయం

కరోనా వైరస్ సోకిన వారిలో రుచి, వాసన కనిపెట్ట లేకపోవడం వంటి కొత్త లక్షణాలను వెలుగులోకి తెచ్చిన అమెరికా సంస్థ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)... దీనికి సంబంధించి మరో విషయాన్ని బయటపెట్టింది.

నోవెల్ కరోనా వైరస్ బారిన పడిన వారిలో మూడో రోజుకే వాసన పసిగట్ట లేకపోవడం సంభవిస్తుందని తాజా అధ్యయనంలో గుర్తించింది. వీరిలో చాలా మంది రుచిని గ్రహించే శక్తిని కూడా కోల్పోతున్నారని సిన్సినాటి యూనివర్సిటీకి చెందిన ఓ పరిశోధకుడు వెల్లడించారు. ప్రత్యేకించి చిన్న వయసు పేషెంట్లు, మహిళల్లోనే అత్యధికంగా ఘ్రాణశక్తిని కోల్పోతున్నట్టు గుర్తించామన్నారు.

‘‘ఎంత ఎక్కువగా వాసన గుర్తించే శక్తిని కోల్పోతే అంత తీవ్రంగా ఇతర కొవిడ్-19 లక్షణాలు ఉన్నట్టు కూడా మా అధ్యయనంలో గుర్తించాం. ఘ్రాణశక్తిని అధికంగా కోల్పోయిన వారిలో శ్వాస తీసుకోలేకపోవడం, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కూడా తీవ్రంగా కనిపించాయి...’’ అని యూసీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ అహ్మద్ సెదాఘట్ పేర్కొన్నారు.
 
స్విజర్లాండ్‌లోని ఆరవ్ కాంటోన్‌స్పిటల్‌లో 103 మంది కరోనా బాధితులను ఆరు వారాల పాటు పరిశీలించిన మీదట ఈ లక్షణాలను గుర్తించినట్టు ఈ అధ్యయనం తెలిపింది. కొవిడ్-19 వ్యాధికి గురై ఎన్నిరోజులయ్యిందీ... ఎప్పట్నుంచి, ఎంత మొత్తంలో వాసన గుర్తించలేక పోతున్నారన్న విషయాలపై పేషెంట్ల వద్ద వివరాలు సేకరించారు. వీరిలో 61 శాతం మంది తాము వాసన గుర్తించలేకపోతున్నట్టు తెలిపారు.

ఘ్రాణశక్తిని కోల్పోవడం కరోనా సూచనల్లో ఒకటిమాత్రమేననీ.. కానీ ఇది ఒక్కటే కారకం కాదని సెదాఘట్ తెలిపారు. ‘‘శ్వాస సరిగా తీసుకోలేక పోవడం, శ్వాసకోశ ఇబ్బందులతో కూడిన తీవ్రమైన కొవిడ్-19 లక్షణాలు మీకు ప్రారంభమైతే వెంటనే అప్రమత్తం కావాలి..’’ అని ఆయన పేర్కొన్నారు.