శ్మశాన నిశ్శబ్దాన్ని తలపిస్తున్న వుహాన్ నగరం.. వీధుల్లో శవాలు
చైనాలోని వుహాన్ నగరం నిత్యం జనంతో రద్దీగా ఉండే ప్రాంతం. ఇక్కడ కోటిన్నర మందికిపైగా జనాభా వుంటారు. ఈ నగరంలోని ప్రధాన వాణిజ్య వీధులన్నీ నిత్యం కోలాహలంగా ఉంటాయి. అయితే, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇక్కడ నుంచే ప్రబలింది. ఈ వైరస్ ధాటికి వందలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా, వేలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. ఇపుడు వుహాన్ నగరంలోని ఓ వీధి పేవ్‌మెంట్‌పై ఓ వ్యక్తి శవం పడివుంది. దాన్ని చూసిన వుహాన్ వాసులు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తుండిపోయారు.
వుహాన్ నగరం కరోనా వైరస్‌కు కేంద్రంగా మారిందన్న విషయం ఈ ఒక్క సంఘటన నిజం రుజువు చేస్తోంది. ఫలితంగా నగరంలోని పలు వీధులు నిర్మానుషంగా మారిపోయాయి. అక్కడ వీధిలో ఉన్న పేవ్‌మెంట్‌పై ఓ మనిషి చనిపోగా, చేతిలో ప్లాస్టిక్ కవర్ పట్టుకుని, మూతికి మాస్క్ కట్టుకుని ఉన్నాడు. ఆ వ్యక్తి.. వీధిలో శవమై కనిపించడం ఆందోళన కలిగిస్తున్నది.
సుమారు కోటిన్నర జనాభాతో ఎప్పుడూ బిజీగా ఉండే ఆ సిటీ ఇప్పుడు నిర్మానుషంగా మారింది. కరోనా వైరస్ వల్ల ఆ వ్యక్తి మృతిచెంది ఉంటాడని అనుమానాలు కలుగుతున్నాయి. వీధిలో చనిపోయిన వ్యక్తిని మెడికల్ ఎమర్జెన్సీ వాహనంలో తీసుకువెళ్లారు. అక్కడ ఉన్న కొందరు ఆ దృశ్యాన్ని చూశారు. కానీ ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు.