డిగ్రీ పట్టా స్వీకరించేలోపు పది మొక్కలు నాటాల్సిందే... ఎక్కడ?
ఫిలిప్పీన్స్ దేశం విద్యార్థులకు సరికొత్త షరతు విధించింది. డిగ్రీ పట్టా స్వీకరించేలోపు ఖచ్చితంగా పది మొక్కలు నాటాల్సిందేనన్న నిబంధన విధించింది. ఈ దేశాన్ని గత కొన్నేళ్ళుగా కాలుష్యం భూతం పట్టిపీడిస్తోంది. దీనివల్ల అనేక మంది వివిధ రకాలైన అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. ఈ కాలుష్యానికి విరుగుడు చెట్ల పెంపకమేనని అనేక దేశాలు గుర్తించి, ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాయి.
పర్యావరణ హితం కోరి మొక్కలు నాటడం అనేది పలు ప్రాంతాల్లో ఉద్యమ స్థాయిలో నడుస్తోంది. ఆసియా దేశం ఫిలిప్పీన్స్‌లో ఆసక్తికర చట్టం చేయడం పర్యావరణ ప్రాధాన్యతను చాటిచెబుతోంది. ఫిలిప్పీన్స్‌లో ప్రతి విద్యార్థి తాను పట్టభద్రుడు అయ్యేలోపు కనీసం 10 మొక్కలు నాటాలని ఆ చట్టంలో పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన బిల్లు ఫిలిప్పీన్స్ చట్టసభలో గత యేడాది మే 15న ఆమోదం పొంది చట్ట రూపం దాల్చింది. ఓ విద్యార్థి ప్రాథమిక విద్యాభ్యాసం మొదలుకుని హైస్కూల్, కాలేజీ విద్యాభ్యాసం పూర్తి చేసే క్రమంలో 10 మొక్కలు తప్పనిసరిగా నాటాలని ఆ చట్టంలో పొందుపరిచారు.
ఈ విధానం వల్ల ప్రతి ఏటా 175 మిలియన్ మొక్కలు నాటే అవకాశం ఉందని, తద్వారా ఓ తరంలో 525 బిలియన్ మొక్కలు ఈ భూమిపై పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ మొక్కలను అటవీప్రాంతాల్లోనూ, పాడుబడిన గనుల్లోనూ నాటాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఫిలిప్సీన్స్ విద్యాశాఖ పర్యవేక్షించనుంది.