ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం.. 52 మంది సజీవదహనం
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 52 మంది సజీవదహనం అయ్యారు. మరో 50 మంది తీవ్ర గాయాలపాలైనట్టు సమాచారం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
నారాయన్ రుప్ గంజ్‌లోని షెజాన్ జ్యూస్ ఫ్యాక్టరీలో గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. మొదట గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. భవనంలో ప్లాస్టిక్ బాటిల్స్, కెమికల్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి. దాంతో క్షణాల్లో మంటలు పై అంతస్తులకు వ్యాపించాయి. తప్పించుకునేందుకు ఫ్యాక్టరీలోని సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మంటల్లో కాలి 52 మంది వరకు సజీవదహనమయ్యారు.
మరో 50మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టు ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది. మరికొంత మంది కార్మికులు భవనం పైనుంచి కిందకు దూకేశారు. ఈ క్రమంలో ముగ్గురు తీవ్ర గాయాలై మరణించారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన 18 ఫైరింజన్లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున మంటలు అదుపులోకి వచ్చాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మరికొంతమంది కార్మికుల ఆచూకీ లభించలేదు. వారిలో 44 మందిని మాత్రమే గుర్తించారు. అగ్నిప్రమాద సమయంలో ఫ్యాక్టరీ మెయిన్ గేట్ మాత్రమే ఓపెన్ చేసి ఉందని, మిగితా గేట్లని మూసివేసి ఉన్నాయని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. ఫ్యాక్టరీలో అగ్నిమాపక భద్రతా చర్యలు సరిగా లేవని విమర్శిస్తున్నారు.