చమన్ నగరంలో బాంబు పేలుళ్లు - ద్విచక్రవాహనంలో ఐఈడీ అమర్చి...
పాకిస్థాన్ దేశంలో మరోమారు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దేశంలోని చమన్ నగరంలోని హజి నిడా మార్కెట్‌లో ఈ పేలుళ్లు సోమవారం జరిగాయి. నిర్మాణంలో ఉన్న ఓ భవనం సమీపంలో సోమవారం జరిగిన పేలుడులో ఐదుగురు మృతి చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి.
నగరంలోని మాల్ రోడ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనానికి పేలుడు పరికరం (ఐఈడీ) అమర్చి బ్లాస్ట్‌కు పాల్పడ్డారని ఆ దేశానికి చెందిన ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్తా సంస్థ వెల్లడించింది.
ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో నిర్మాణంలో ఉన్న భవనం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించారు. అయితే, ఈ పేలుళ్ళకు ఎవరు పాల్పడ్డారో తెలియాల్సివుంది.
మరోవైపు, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం చమన్ పేలుడును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో బలూచిస్తాన్‌లో దాడులు పెరిగిపోయాయి. జూలై 21న టర్బాట్ బజార్‌లో పేలుడు సంభవించి ఒకరు మృతి చెందగా, మరికొంతమంది గాయపడిన విషయం తెల్సిందే.