గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : గురువారం, 6 ఆగస్టు 2020 (19:57 IST)

పాకిస్తాన్ కొత్త మ్యాప్ గురించి చైనా ఎందుకు నోరు మెదపలేదు

జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసి ఏడాది కావడంపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. కశ్మీర్‌లో యధాతథ స్థితిలో మార్పులు చేసిన భారత్ ఏకపక్ష నిర్ణయాల ద్వారా అక్రమ, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిందని చైనా చెప్పింది. భారత్ గత ఏడాది ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేసినప్పుడు కూడా చైనా ఇలాగే అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

 
చైనా ప్రకటనపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతం వ్యక్తం చేసింది. మిగతా దేశాల అంతర్గత అంశాలపై చైనా వ్యాఖ్యానించడం తగదని చెప్పింది. చైనాకు అలా మాట్లాడ్డానికి ఎలాంటి అధికారం లేదంది. పాక్ ప్రభుత్వ సమాచార ఏజెన్సీ అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ పాకిస్తాన్ బుధవారం ఓ మీడియా సమావేశంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్‌ను కశ్మీర్, భారత్‌కు సంబంధించి ఒక ప్రశ్న అడిగింది.

 
“కశ్మీర్ జనాభా కోసం భారత్ ఏకపక్ష చర్యలు చేపట్టింది. వాటికి ఈరోజుకు ఏడాది పూర్తైంది. అమాయకులైన కశ్మీరీలకు వ్యతిరేకంగా ఇప్పటికీ అరాచకాలు కొనసాగుతున్నాయి. భారత్ ఈ చర్యలు, సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘన కాకుండా, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా చేస్తున్న ఈ ప్రకటనలు అంతర్జాతీయ శాంతికి ముప్పు. భారత్ ఆ చర్య చేపట్టినప్పటి నుంచీ, కశ్మీర్ వివాదాన్ని ఐక్యరాజ్యసమితి చార్టర్, శాంతిపూర్వక విధానాల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా వాదిస్తూ వచ్చింది. ప్రస్తుతం చైనా వైఖరి ఎలా ఉంది?" అని ఏపీపీ ప్రశ్నించింది.

 
“చైనా దృష్టి కశ్మీర్‌ పరిస్థితిపైనే ఉంది. కశ్మీర్ అంశంలో మా వైఖరి పూర్తి స్థిరంగా, స్పష్టంగా ఉంది” అని వెన్‌బిన్ సమాధానం ఇచ్చారు. “మొదటి విషయం, కశ్మీర్ అంశం భారత్, పాకిస్తాన్ మధ్య చారిత్రక వివాదంగా ఉంది. ఆ విషయం ఐక్యరాజ్య సమితి చార్టర్, భద్రతా మండలి తీర్మానాల్లో, రెండు దేశాల ద్వైపాక్షిక ఒప్పందాల్లో కూడా చెప్పారు. ఇక రెండో విషయం, కశ్మీర్ యథాతథ స్థితిలో ఏకపక్షంగా ఏవైనా మార్పులు చేయడం అనేది చట్టవిరుద్ధం.

 
ఇక మూడో విషయం, కశ్మీర్ అంశానికి రెండు దేశాలూ శాంతిపూర్వక చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలి. భారత్, పాకిస్తాన్ రెండూ పొరుగు దేశాలు. అది ఎవరూ మార్చలేరు. రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉంటే అది రెండింటికీ, అంతర్జాతీయ సమాజానికి కూడా ప్రయోజనకరమే. రెండు దేశాలు చర్చల ద్వారా తమ విభేదాలను పరిష్కరించుకుంటాయని, బంధం కొనసాగిస్తాయని మేం ఆశిస్తున్నాం. అది రెండు దేశాలకు, ఆ ప్రాంతం మొత్తం అభివృద్ధికి, శాంతి, స్థిరత్వానికి అనుకూలంగా ఉంటుంది” అన్నారు.

 
పాక్ కొత్త మ్యాప్‌పై చైనా ఎలా స్పందించింది?
పాకిస్తాన్ మంగళవారం విడుదల చేసిన కొత్త మ్యాప్ గురించి ఇదే మీడియా సమావేశంలో సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్.. వాంగ్ వెన్‌బిన్‌ను ప్రశ్నించింది. “పాకిస్తాన్ ప్రధాని కొత్త మ్యాప్ విడుదల చేశారు. అందులో పాక్ పాలిత కశ్మీర్‌ను వివాదాస్పద ప్రాంతంగా చూపించారు. దీనిపై మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా“ అని ఎస్‌సీఎంపీ అడిగింది. సమాధానంగా వెన్‌బిన్ “కశ్మీర్ అంశంపై చైనా వైఖరిని నేను ఇప్పటికే స్పష్టం చేశాను. దాని గురించి నేను మళ్లీ చెప్పాలనుకోవడం లేదు” అన్నారు.

 
ప్రత్యేకంగా లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంపై గత ఏడాది చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ అప్పుడు, ప్రస్తుతం చైనా నియంత్రణలో ఉన్న అక్సాయ్ చిన్‌ కూడా లద్దాఖ్‌లో భాగం అని చెప్పింది. అయితే, దానివల్ల సరిహద్దుల్లో ఎలాంటి మార్పులు రావని భారత్ చెప్పింది. బుధవారం కశ్మీర్‌పై చైనా తమ అభిప్రాయం వెల్లడించినపుడు లద్దాఖ్ గురించి ప్రస్తావించలేదు. చైనా గత ఏడాది భారత్‌ను తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విషయాన్ని భద్రతా మండలి వరకూ తీసుకెళ్లింది.

 
పాకిస్తాన్ తన నియంత్రణలో ఉన్న కశ్మీర్‌లో చాలా రకాల అంతర్గత మార్పులు చేసింది. కానీ చైనా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. పాకిస్తాన్ గిల్గిత్-బాల్టిస్తాన్‌లో పాలనాపరమైన మార్పులు చేసిందని భారత అధికారులు చెబుతున్నారు.
పాకిస్తాన్ జారీ చేసిన కొత్త మ్యాప్‌పై మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసిన భారత విదేశాంగ శాఖ అందులో “ఇమ్రాన్ ఖాన్ జారీ చేసిన... పాకిస్తాన్‌దిగా చెబుతున్న రాజకీయ మ్యాప్‌ను మేం చూశాం” అని తెలిపింది.

 
“గుజరాత్, జమ్ము-కశ్మీర్‌పై ఇలాంటి వాదనలు చేయడం రాజకీయ మూర్ఖత్వం. ఈ హాస్యాస్పద చర్యలకు ఎలాంటి చట్టబద్ధత రాదు, అంతర్జాతీయ సమాజంలో విశ్వసనీయత కూడా ఉండదు. నిజానికి, ఈ కొత్త ప్రయత్నాలు సీమాంతర ఉగ్రవాదం ద్వారా పాకిస్తాన్ ప్రాంతీయ విస్తరణ ఉద్దేశాన్ని బలపరుస్తున్నాయి” అన్నారు.