ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2024 (09:53 IST)

చేతిలో చేయి వేసి.. ఒకరినొకరు చూసుకుంటూ... డచ్ మాజీ ప్రధాని దంపతుల కారుణ్య మరణం

lovers
డచ్ మాజీ ప్రధానమంత్రి దంపతులు ప్రాణాలు కోల్పోయారు. చేతిలో చేయి వేసి.. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ప్రాణాలు విడిచారు. వీరిద్దరూ కారుణ్య మరణం ద్వారా తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. ప్రేమికుల దినోత్సవానికి కొద్ది రోజుల ముందు ఈ విషాదకర ఘటన నెదర్లాండ్స్ దేశంలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నెదర్లాండ్స్ మాజీ ప్రధాని డ్రెస్ వాన్ ఆర్ట్. ఈయన సతీమణి యూజీని. వీరిద్దరూ ఒకేసారి మృత్యుఒడిలోకి చేరుకున్నారు. 93 ఏళ్ల వయసున్న వీరు అక్కడి చట్టం ప్రకారం కారుణ్య మరణాన్ని ఎంచుకొని, చివరి క్షణాల్లో ఒకరి చేతిలో మరొకరు చేతులు వేసుకుని, ఒకరినొకరు చూసుకుంటూ ఈ నెల 5వ తేదీన కన్నుమూశారు. దీంతో వీరి మధ్య 70 ఏళ్ల ప్రేమ బంధానికి తెరపడింది. 1977 నుంచి 1982 వరకూ డచ్ ప్రధానిగా సేవలందించిన వాన్ ఆర్ట్ 93వ పుట్టినరోజు జరుపుకొన్న మూడు రోజుల తర్వాత స్వగ్రామమైన నిజమెగెన్ తన ప్రియమైన భార్య యూజీనీ చేతిలో చేయి వేసి, ఆమెతో పాటే మరణించారు అని ఆయన స్థాపించిన హక్కుల సంస్థ వాన్ ఆగ్స్ క్లబ్ ప్రకటించింది. 
 
కాగా, 2019లో బ్రెయిన్ హేమరేజ్ బారినపడిన వాన్ ఆర్ట్ ఆ తర్వాత పూర్తిగా కోలుకోలేకపోయారు. ఒకరిని విడిచి మరొకరు జీవించలేమని నిర్ణయించుకున్న తర్వాత వారు కారుణ్య మరణాన్ని ఎంచుకున్నారు. కాగా, 2002లో నెదర్లాండ్స్‌లో కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేసిన తర్వాత అక్కడ ఇలాంటి కేసులు నాలుగు రెట్లు పెరిగాయి. 2022లోనే 8,720 మంది దీన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ ఏడాది 2 కోరుకుంటే 2023లో ఇది 58 జంటలకు పెరిగింది.