గొటబాయ రాజపక్సేకు షాకిచ్చిన సింగపూర్
దేశాన్ని పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో నెట్టేసి ఆ దేశం నుంచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలుత ఆయన కొలంబో నుంచి మాల్దీవులకు వెళ్లారు. అక్కడ శ్రీలంక జాతీయులు ఆయనకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చిన నిరసన తెలిపారు. దీంతో ఆయన అక్కడ నుంచి సింగపూర్‌లో అడుగుపెట్టారు.
అయితే ఇప్పుడు ఆయన తమ దేశం వీడాలని సింగపూర్ కోరుకుంటోంది. ఆయన తమ దేశంలో ఉండేందుకు గడువును పొడిగించలేమని ఆ దేశ అధికారులు గొటబాయకు తేల్చిచెప్పినట్లు సమాచారం.
శ్రీలంక ప్రజల ఆగ్రహ జ్వాలలను తట్టుకోలేని గొటబాయ.. భార్యతో కలిసి మొదట మాల్దీవులకు వెళ్లిపోయారు. ఆ తర్వాత గురువారం సింగపూర్ చేరుకున్నారు. ఆ దేశంలో దిగే సమయానికి ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయలేదు. ఆయన అధ్యక్ష హోదాలో వ్యక్తిగత పర్యటనకు వచ్చారని అప్పుడు సింగపూర్ ప్రభుత్వం చెప్పింది.
అయితే ఆయన మరికొన్ని రోజులు తమ దేశంలో ఉండేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఆయన ఆశ్రయం కోరలేదని, తాము కూడా ఎలాంటి ఆశ్రయం ఇవ్వలేదని సింగపూర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆయన కొద్ది రోజుల క్రితమే అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో సింగపూర్ నుంచి ఈ స్పందన వచ్చినట్లు తెలుస్తోంది.