సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జూన్ 2022 (14:13 IST)

అమర్నాథ్ యాత్ర ప్రారంభం - 80 వేల మంది సైనికులతో పహారా

amarnath yatra
కాశ్మీర్ లోయలో పవిత్ర అమర్నాథ్ యాత్ర మొదలైంది. హిమాలయాల్లో కొలువైన పవిత్ర మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు తొలి బ్యాచ్ భక్తులు అమర్నాథ్ యాత్రకు బయలుదేరారు. దాదాపు ఐదువేల మందితో కూడిన మొదటి బ్యాచ్ యాత్రను జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. 
 
కాగా, కరోనా వైరస్ మహ్మారి కారణంగా గత రెండేళ్లుగా అమర్నాథ్ యాత్రకు కేంద్రంతో పాటు స్థానిక యంత్రాంగం అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈ యేడాది హిమ లింగాన్ని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారని జమ్మూకాశ్మీర్ భావిస్తోంది.
 
కాగా తొలి బ్యాచ్‌లో 4,890 మంది భక్తులు అమర్నాథ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య తొలి బ్యాచ్ జమ్మూకాశ్మీర్‌లోని బాల్తాన్ బేస్ క్యాంపునకు చేరుకుంటుంది. అక్కడ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్ర గుహకు తొలి బ్యాచ్ పయనమవుతుంది. గుహను చేరుకోవడానికి సుమారుగా 5-8 గంటల సమయం పడుతుంది. 
 
మరోవైపు, ఈ యాత్రను భగ్నం చేసేందుకు తీవ్రవాదులు కుట్రపన్నుతున్నారని నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతను కట్టుదిట్టం చేసింది. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి కూంబింగ్ పెంచారు. దాదాపు 80 వేల మంది సైనికలు అమర్నాత్ యాత్ర కోసం పహారా కాస్తున్నారు. అలాగే డ్రోన్లు, సీసీ కెమెరాలతో అమర్నాథ్ యాత్రా మార్గాలపై నిఘా ఉంచారు. 
 
యాత్రికులందరినీ రేడియో ప్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్‌ల ద్వారా ట్రాక్ చేస్తున్నారు. జాగిలాలతో అమర్నాథ్ యాత్రా మార్గాలను జల్లెడపుతున్నారు. యాత్రా మార్గంలో ఎలాంటి వాహనాలు కూడా ఆగకుండా నిషేధం విధించారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఎప్పటికపుడు బద్రతను పర్యవేక్షిస్తున్నారు. యాత్రికుల వెంట ఆధార్ కార్డులు, ఇతర డాక్యుమెంట్లను తీసుకునిరావాలని అధికారులు ఆదేశించారు.