హాంబర్గ్ ఎయిర్‌పోర్టులో తుపాకీతో దుండగుడి హల్చల్.. విమాన సేవలు నిలిపివేత
జర్మనీ దేశంలోని హాంబర్గ్ విమానాశ్రయంలోని ఓ దుండగుడు తుపాకీతో ప్రవేశించి హల్చల్ సృష్టించాడు. టార్మాక్‌పై వాహనాన్ని నిలిపిన ఆ దండుగుడు.. ఇద్దరు చిన్నారులను బందీలుగా చేసుకున్నాడు. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఈ విమానాశ్రయంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసి, విమాన సేవలను నిలిపివేశారు.
సాయుధ దుండగుడు ఒకడు అత్యంత కట్టుదిట్టంగా ఉండే భద్రతా సిబ్బందిని దాటుకుని వాహనాన్ని ఎయిర్‌పోర్టు రన్‌వే పైకి తీసుకెళ్లి నిలిపాడు. నిందితుడు తుపాకీతో కాల్పులు జరుపుతూ ఇద్దరు చిన్నారను బందీలుగా చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే, ఈ ఘటనతో అప్రమత్తమైన ఎయిర్ పోర్టు సిబ్బంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. విమానాశ్రయాన్ని తాత్కాలింకగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దుండగుడు కారును రన్ వేపై ఉంచాడు. దుండగుడిని సంప్రదించేందుకు పోలీసులు, మానసిక నిపుణులు ప్రయత్నిస్తున్నారు.
కుటుంబ వివాదం కారణంగానే దుండగుడు ఇలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దీంతో హాంబర్గ్ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 35 ఏళ్ల ఒక వ్యక్తి కారులో విమానాశ్రయంలోనికి బ్యారికేడ్లను ఢీకొంటూ కారును రన్ వేపైకి తీసుకెళ్లి నిలిపాడు. ప్రస్తుతం ఆ కారు ఓ విమానం కింద అడ్డంగా పార్క్ చేసినట్లు ఎయిర్ పోర్టు ప్రతినిధి వెల్లడించారు. విమానంలోని ప్రయాణికులను గ్యాంగ్వే మార్గంలో సురక్షింతంగా బయటకు తరలించారు. అయితే, కారు డ్రైవరు ఇప్పటికీ కారులోనే ఉన్నాడని.. అతడి 4 ఏళ్ల వయసున్న కుమార్తె కూడా అక్కడ అతడితోనే ఉందని అధికారులు చెప్పారు. ఇప్పటికే పోలీసులు అక్కడకు చేరుకొని అనుమానితుడి చెరలో ఉన్న బాలికను విడిపించడానికి యత్నించారు. నిందితుడి భార్య ఇప్పటికే తన కుమార్తె కనిపించడంలేదని హాంబర్గ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరోవైపు ఎయిర్‌పోర్టు మొత్తాన్ని మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు 27 విమాన సర్వీసులపై దీని ప్రభావం పడింది. అనుమానితుడు ఇప్పటికే రెండు సార్లు కాల్పులు జరపడం, కొన్ని సీసాలకు నిప్పంటించి బయటకు విసరడం వంటి చర్యలకు పాల్పడ్డాడు. దీంతో ప్రత్యేక దళాలను కూడా అక్కడకు తరలించారు. దీంతోపాటు మానసికి నిపుణులు, సీనియర్ అధికారులు ఆ దండగుడితో చర్చలు జరిపేందుకు అక్కడికి చేరుకొన్నారు.