మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (10:36 IST)

మహాప్రభో మలేరియా మాత్రలు ఇవ్వండి .. ట్రంప్ :: నిర్ణయం తీసుకోని మోడీ

మలేరియా మాత్రలు కావాలంటూ భారత్‌ను అమెరికా పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. ఈ మాత్రలను అమెరికా కోరడానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు కొంతమేరకు విరుగుడుకు ఉన్న మాత్ర ఒక్క మలేరియా (హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్‌) టాబ్లెట్ మాత్రమే. ఈ మాత్రలు భారత్‌లో ఉత్పత్తి అధికం. అందుకే సాధారణ మందుల షాపుల్లో కూడా ఈ మాత్రలు అందుబాటులో ఉంటాయి. 
 
ఇపుడు కరోనా వైరస్ వైరస్‌ విరుగుడుకు ఈ మాత్రలను ప్రాథమిక ఔషధంగా వాడుతున్నారు. ఈ మాత్రల ఉత్పత్తి అమెరికాలో తక్కువ. దీంతో భారీ సంఖ్యలో మలేరియా మాత్రలను ఎగుమతి చేయాలని భారత్‌ను అమెరికా పదేపదే కోరుతోంది. ఇదే అంశంపై కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీతో అగ్రరాజ్య అధినేత డోనాల్డ్ ట్రంప్ ఫోనులో సంప్రదించి విజ్ఞప్తి చేశారు కూడా. 
 
కానీ ప్రధాని మోడీ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మౌనంగా ఉన్నారు. ఇది అమెరికాకు ఆగ్రహం తెప్పిస్తోంది. తాము కోరినట్టుగా మలేరియా నివారణకు వినియోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్‌ను ఎగుమతి చేయనిపక్షంలో భారత్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినట్టు సమాచారం. 
 
ఇదే అంశంపై డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ, అమెరికా, ఇండియా మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని, అయితే, యూఎస్ ఆర్డర్ ఇచ్చినట్టుగా మెడిసిన్‌ను ఎందుకు పంపించడం లేదన్న కారణం మాత్రం తెలియడం లేదని చెప్పుకొచ్చారు. 
 
'అది నరేంద్ర మోడీ నిర్ణయమని నేనేమీ అనుకోవడం లేదు. ఇతర దేశాలకు కూడా దాని ఎగుమతిని నిలిపివేసినట్టు మోడీతో ఫోనులో మాట్లాడిన వేళ నాకు తెలిసింది. ఆయనతో సంభాషణ నాకు సంతోషాన్ని ఇచ్చింది. అమెరికా కోరిక మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను విడుదల చేస్తారనే అనుకుంటున్నా' అని చెప్పుకొచ్చారు. 
 
ఇరు దేశాల మధ్యా వాణిజ్యపరంగా సత్సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన ఆయన, ఒకవేళ ఔషధాన్ని పంపకుంటే, ఏం చేయాలన్న విషయాన్ని ఆలోచిస్తామని, పరిస్థితిని బట్టి యూఎస్ నిర్ణయాలుంటాయని అన్నారు.
 
కాగా, మలేరియా నివారణకు వినియోగించే ఈ టాబ్లెట్లు కరోనా వైరస్‌ను నియంత్రించడంలో ఉపకరిస్తుండటంతో, దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. భారత్‌లో ఈ ఔషధం విరివిగా తయారవుతూ, సాధారణ మెడికల్ షాపుల్లోనూ లభించే పరిస్థితి. 
 
దీంతో పలు దేశాలు తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను పంపించాలని భారత్‌ను కోరుతున్నాయి. ప్రస్తుతం ఈ మాత్రల ఎగుమతిపై ఇండియాలో నిషేధం అమలవుతూ ఉండటంతో ఇతర దేశాలకు ఎగుమతులకు అడ్డంకిగా మారింది.