India: ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ దాడులు: ఖండించిన భారత్
ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ జరిపిన తాజా దాడులను భారతదేశం ఖండించింది. ఇందులో అనేక మంది పౌరులు మరణించారు. వారాల పాటు జరిగిన పోరాటాన్ని ముగించడానికి కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేసిన రెండు నెలల లోపే ఇరుపక్షాల మధ్య తాజా ఘర్షణలు చెలరేగాయి. సరిహద్దు ఘర్షణల్లో అనేక మంది ఆఫ్ఘన్ పౌరులు మరణించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో అన్నారు.
అమాయక ఆఫ్ఘన్ ప్రజలపై ఇటువంటి దాడులను తాము ఖండిస్తున్నామని జైశ్వాల్ పేర్కొన్నారు. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం, స్వాతంత్ర్యాన్ని గట్టిగా సమర్థిస్తుందని ఆయన అన్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ పాలన ప్రతినిధి మాట్లాడుతూ, పాకిస్తాన్ ఈ దాడులను ప్రారంభించింది. కాబూల్ ప్రతిస్పందించవలసి వచ్చిందని తెలిపారు. కాబూల్‌పై పాకిస్తాన్ వైమానిక దాడి తర్వాత అక్టోబర్ ప్రారంభంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు వివాదం ప్రారంభమైంది.
ఈ దాడికి ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా స్పందించింది. ఆ తర్వాత వివాదం మరింత పెరిగింది. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారతదేశాన్ని సందర్శిస్తున్న సమయంలో శత్రుత్వం చెలరేగింది. 2021లో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుండి ఈ ఘర్షణలు అత్యంత దారుణమైనవి. ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వం వహించిన చర్చల తర్వాత అక్టోబర్ 19న ఇరుపక్షాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.