ఆపరేషన్ సిందూరతో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్య చేపట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడులను జీర్ణించుకోలేని పాకిస్థాన్ భారత్‌పై యుద్దానికి దిగింది. దీంతో భారత్ కూడా ప్రతీకార దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయినట్టు అంతర్జాతీయ సంస్థలు వెల్లడిస్తున్న నివేదికల్లో పేర్కొంటున్నాయి.
ఈ ఆపరేషన్ ఫలితంగా పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన నాలుగు ఎఫ్-16 యుద్ధ విమానాలను భారత క్షిపణి వ్యవస్థలు కూల్చివేశాయి. అంతేకాకుండా, పాక్ వైమానిక దళానికి అత్యంత కీలకమైన సర్గోదా వైమానిక స్థావరం కూడా ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నది. ముఖ్యంగా అక్కడి రాడార్ వ్యవస్థ దాదాపుగా నాశనమైందని, దీని మరమ్మతులకు సుమారు 100 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
నివేదికల ప్రకారం, ధ్వంసమైన నాలుగు ఎఫ్-16 యుద్ధ విమానాల విలువ సుమారు 349.52 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. దీంతో పాటు ఒక సి-130 రవాణా విమానం వల్ల 40 మిలియన్ డాలర్లు, హెచ్ క్యూ 9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్ల 200 మిలియన్ డాలర్లు, రెండు మొబైల్ కమాండ్ కేంద్రాలు ధ్వంసం కావడం వల్ల మరో 10 మిలియన్ డాలర్ల మేర పాకిస్థాన్ నష్టపోయిందని నివేదికలు చెబుతున్నాయి.
పాకిస్థాన్ వైమానిక దళంలో ఎఫ్-16 విమానాలు, చైనా, ఫ్రెంచ్ యుద్ధ విమానాలతో పాటు ప్రధాన ఆయుధాలుగా ఉన్నాయి. 'ఆపరేషన్ సిందూర్' పేరిట భారత్, పాకిస్థాన్‌తో పాటు పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థలైన జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన తొమ్మిది రహస్య స్థావరాలను భారత బలగాలు నేలమట్టం చేశాయి. ఈ ఘటనల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు.