సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 25 నవంబరు 2017 (10:48 IST)

సర్వాంగసుందరంగా ముస్తాబైన లాడ్ బజార్.. ఎందుకు?

హైదరాబాద్ పాతబస్తీలోని లాడ్ బజార్. ఇపుడు ఈ పేరు ప్రతి ఒక్కరినోట్లనూ నానుతోంది. దీనికి ప్రత్యేక కారణం లేకపోలేదు. ఈనెల 28వ తేదీ నుంచి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు జరుగనుంది.

హైదరాబాద్ పాతబస్తీలోని లాడ్ బజార్. ఇపుడు ఈ పేరు ప్రతి ఒక్కరినోట్లనూ నానుతోంది. దీనికి ప్రత్యేక కారణం లేకపోలేదు. ఈనెల 28వ తేదీ నుంచి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. ఇందులో సుమారు 100 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ప్రారంభించనున్నారు. 
 
ఇందుకోసం ఇవాంకా ట్రంప్ కట్టుదిట్టమైన భద్రతనడుమ హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆమెకోసమే పాతబస్తీలోని లాడ్ బజాప్ (చుడీ బజార్) సిద్ధమైంది. మహ్మద్‌ కులీకుతుబ్‌షా గారల పట్టి హయాత్‌ బక్షీ కోసం అప్పట్లో ఏర్పాటు చేసిన చుడీబజార్‌ (లాడ్‌ బజార్‌) ఇప్పుడు అగ్రరాజ్య అధినేత  ముద్దుల కూతురు ఇవాంకా సందర్శన కోసం ప్రత్యేకంగా ముస్తాబైంది. ప్రపంచంలోనే పేరెన్నికగన్న ముత్యాలు భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను  ప్రతిబింభించే గాజులకు నెలవైన హైదరాబాద్‌ లాడ్‌బజార్‌ ప్రత్యేక ఆకర్షణగా మారింది. 
 
ఇవాంక మనస్సు దోచుకొనే రకరకాల డిజైన్‌ గాజులతో దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఒక్క గాజులే కాకుండా వెరైటీ వస్త్రాలు, ఆభరణాలు, శతాబ్దాలుగా మగువల మదిని దోచుకుంటున్న డిజైన్‌లు ఇవాంకా కోసం పాతబస్తీలో ప్రదర్శనకు ఉంచారు. అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సులో భాగంగా ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందుకు హాజరుకానున్న ఇవాంకా పాతబస్తీలోని లాడ్‌బజార్‌ను సైతం సందర్శించనున్నారు. దీంతో చుడీ బజార్‌లో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.