శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2020 (12:51 IST)

భయపెడుతున్న కరోనా... ఎమర్జెన్సీ దిశగా జపాన్ అడుగులు

ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసిన కరోనా వైరస్ అనేక దేశాలను పట్టిపీడిస్తోంది. ఇలాంటి దేశాల్లో జపాన్ ఒకటి. ఈ దేశంలో వైరస్ బారినపడే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో జపాన్ పాలకులు అత్యయికస్థితిని (ఎమర్జెన్సీ)ని విధించాలన్న తలంపులో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం జపాన్ దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. జపాన్‌ ఇప్పటివరకు 3,500 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 85 మంది మృత్యువాత పడ్డారు. రాజధాని టోక్యోలో దాదాపు 1000 పాజిటివ్‌ కేసులు నమోదు కావటం గమనార్హం.
 
దీంతో ఆ దేశ ప్రధాని షింజో అబే కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మంగళవారం స్టేట్‌ ఆఫ్‌ ఎమర్జెన్సీని ప్రకటించే అవకాశం ఉందని ప్రముఖ జపనీస్‌ పత్రిక మొమియురి పేర్కొంది. 
 
ఈ సోమవారం ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటిస్తారని తెలిపింది. బుధవారం రోజున కరోనాను అరికట్టేందుకు తీసుకోవల్సిన చర్యలను తెరపైకి తేనున్నట్లు న్యూస్‌ ఏజెన్సీ క్యోడో తెలిపింది. కరోనా వైరస్‌ మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు పేర్కొంది.