మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2020 (08:51 IST)

నాలుగేళ్ళ పులికి కరోనా... యూఎస్‌డీఏ నిర్ధారణ

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు అమెరికా అల్లకల్లోలంగా మారింది. ఈ వైరస్ సోకిన మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రతి రోజూ వేలాది సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే, ఇపుడు అమెరికాలో సరికొత్త చిక్కు వచ్చిపడింది. మనిషులు ద్వారా జంతువులకు కూడా ఈ వైరస్ సోకుతోంది. తాజాగా ఓ జూలోని నాలుగేళ్ళ పులికి ఈ వైరస్ సోకింది. ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెట్ ఆఫ్ అగ్రికల్చర్ (యూఎస్డీఏ) వెల్లడించింది. ఈ ఘటన న్యూయార్క్ నగరంలో జరిగింది. 
 
నిజానికి అమెరికాలో కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న నగరం న్యూయార్క్. ఆ దేశంలో నమోదైన కేసుల్లో సింహ భాగం ఇక్కడ నమోదైనవే. అలాంటి న్యూయార్క్ నగరంలో ఇపుడు ఓ పులి పిల్లకు ఈ వైరస్ సోకిందని అమెరికన్ ఫెడరల్ అధికారులు వెల్లడించారు. 
 
నగరంలోని బ్రోంక్స్ జూలో నాలుగేళ్ల పులి నాడియాకు జూపార్క్ ఉద్యోగి నుంచి వైరస్ సోకినట్టు తెలిపారు. ఇదే జూలో ఉన్న మరో ఆరు పులులు, సింహాలు కూడా అనారోగ్యానికి గురయ్యాయి. ప్రస్తుతం నాడియా కోలుకుందని వెల్లడించారు. 
 
కాగా, పులికి కరోనా సోకడంతో అప్రమత్తమైన అధికారులు గత నెల 16న జూను మూసివేశారు. జంతువుల్లోనూ వైరస్ ప్రబలడంతో కొత్త సమస్య తలెత్తినట్టు అయిందని జూపార్క్ డైరెక్టర్ జిమ్ బ్రెహేనీ తెలిపారు. ప్రస్తుతం నాడియాను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.