శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (18:50 IST)

దేశంలో కరోనా మృతులు 79... మొత్తం కేసులు 3374 : లవ్ అగర్వాల్

దేశంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు దేశ వ్యాప్తంగా మత్తం 472 కొత్త కరోనా కేసులు నమోదైనట్టు తెలిపారు. అలాగే, వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 79కి చేరాయని వెల్లడించారు.
 
అంతేకాకుండా, దేశంలో 274 జిల్లాల్లో కరోనా వైరస్ ప్రభావం ఉందన్నారు. గత ఇరవై నాలుగు గంటల్లో 11 మంది మృతి చెందగా, 267 మంది కోలుకున్నారని వివరించారు. కరోనా కట్టడికి ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా పాటించాలని మరోమారు సూచించారు. 
 
మరోవైపు, అస్సాంలో ఓ కరోనా కేసు నెల రోజుల తర్వాత బయటపడింది. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంకు చెందిన ఓ వ్యాపారవేత్త తన వ్యక్తిగత పనుల మీద గత ఫిబ్రవరి 29వ తేదీన ఢిల్లీకి వెళ్ళివచ్చారు. ఆయనలో నెలరోజుల తర్వాక కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
మరోవైపు, మర్కజ్ మీట్‌కు అస్సాం నుంచి 24 మంది తబ్లీగి జమాత్ సభ్యులు వెళ్ళగా వీరిలో 24 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 25 కాగా, అందులో 24 కేసులు తబ్లీగి సభ్యులవే కావడం గమనార్హం. 
 
ఇదే అంశంపై అస్సాం ఆరోగ్య మంత్రి హింతమ బిశ్వ శర్మ మాట్లాడుతూ, ఆ వ్యాపారవేత్త ఢిల్లీ నుంచి తిరిగి గౌహతి వచ్చిన నెల రోజుల తర్వాతే ఆయన ఈ వైరస్ బారినపడ్డట్టు తెలిసిందన్నారు. ఢిల్లిలో ఉండగా ఆయనకు కరోనా సోకి ఉండకపోవచ్చని, గౌహతి వచ్చిన తర్వాతే ఈ వైరస్ ఉన్న వ్యక్తుల ద్వారా ఆయనకు అంటిందని భావించారు. ఈ వ్యాపారవేత్తను కలిసిన వ్యక్తులు దాదాపు 111 మంది వరకు ఉన్నారని, వారి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ లకు పంపినట్టు తెలిపారు.