శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (19:51 IST)

1700 విమానాల్లో అమెరికాలో అడుగుపెట్టిన చైనీయులు.. అందుకే ఈ కల్లోలమా?

మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అల్లాడిపోతోంది. ప్రతిరోజూ ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య వేలల్లో ఉంటే.. మరణాల సంఖ్య కూడా వందల్లో ఉంటోంది. దీంతో అగ్రరాజ్య అధికార యంత్రాంగం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కరోనా వైరస్‌ను కట్టడి చేయలేక తలలు పట్టుకుంటోంది. పైగా, మున్ముందు మరింత గడ్డుకాలం తప్పదనీ, దాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలంటూ సాక్షాత్ ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పిలుపునిస్తున్నారు. దీంతో అమెరికన్లు ప్రాణభయంతో హడలిపోతున్నారు. 
 
నిజానికి అమెరికా అంటే అగ్రరాజ్యం. ఆర్థికంగా ఎంతో ఎత్తులో ఉన్న దేశం. ప్రజల సౌకర్యాల విషయంలో అత్యధిక ప్రమాణాలు పాటించే దేశంగా అమెరికాకు పేరుంది. అటువంటి శ్రీమంతుల రాజ్యంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఈ వైరస్ సునామీలో చిక్కుకుని గడగడలాడిపోతోంది. 
 
ముఖ్యంగా న్యూయార్క్.. అమెరికా మొత్తంలో కరోనాకు కేంద్రంగా మారింది. మరి ఇంతటి దారుణ స్థతి ఎలా దాపురించింది. తప్పు ఎక్కడ జరిగింది? ఇటువంటి ప్రశ్నలకు న్యూయార్క్ టైమ్స్ పత్రిక సవివరమైన కథనాన్ని ప్రచురించింది. ఇందులో అనేక దిగ్భ్రాంతిక విషయాలను వెల్లడించింది. 
 
అమెరికాలో కరోన్ వైరస్ ఆంక్షలు విధించకముందే చైనా నుంచి అమెరికాలోకి అనేక వేల మంది వచ్చిచేరిపోయారు. ఇలా సుమారుగా నాలుగు నుంచి ఐదు లక్షల మంది చైనా నుంచి వచ్చారు. మొత్తం 1700 విమానాల్లో అమెరికాలోని 17 నగరాలకు వీరందరూ చేరుకున్నారని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. 
 
ఇకపోతే దేశంలో కరోనా వైరస్ ఆంక్షలు విధించిన తర్వాత కూడా దాదాపు 40 వేల మంది అమెరికాలో ప్రవేశించారట. మరోవైపు.. చైనా నుంచి వస్తున్న ప్రయాణికుల తనిఖీల విషయంలో కఠినంగా వ్యవహరించకపోవడమే ఈ దుస్థితికి కారణమని ఆ పత్రిక పేర్కొంది. జనవరిలో తొలి రెండు వారాల వరకూ కూడా చైనా నుంచి వచ్చిన వారిలో ఏ ఒక్కరినీ వైరస్‌కు సంబంధించిన స్క్రీనింగ్ చేయలేదని పేర్కొంది. 
 
అమెరికాలో జనవరి 20న తొలి కరోనా కేసు నమోదవగా.. ఇప్పటి వరకూ కరోనా సోకినా తొలి వ్యక్తి అమెరికాలోకి ఎలా ప్రవేశించారనే సమాచారం లేకపోవడం.. అక్కడి పరిస్థితి తీవ్రతను కళ్లకు కట్టినట్టు చెబుతోంది. అంటే.. ఆరంభంలో కరోనా వైరస పట్ల అగ్రరాజ్యం అమెరికా అంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దానిఫలితాన్ని ఇపుడు అమెరికా అనుభవిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.