శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2020 (09:24 IST)

కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకట్టకు కేంద్రం బృహత్తర ప్రణాళిక

దేశంలో ప్రాణాంతక “కోవిడ్-19” వ్యాధి పెద్ద ఎత్తున వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు  కేంద్రం బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. 20 పేజీలతో సవివరమైన “వ్యూహాత్మక కార్యాచరణ”ను కేంద్ర ఆరోగ్యశాఖ రూపొందించింది. పలు రాష్ట్రాలలో “కరోనా” కేసులు నమోదైన ప్రాంతాల నుంచి ఇంకా మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం పొంచి ఉందనే అంచనాతోనే కేంద్రం “ముందస్తు వ్యూహం”తో ముందుకు సాగుతోంది. 
 
తెలంగాణ, కేంద్ర పాలిత ప్రాంతమైన లడాక్, ప్రత్యేకించి మహారాష్ట్ర, కేరళతో సహా మొత్తం 9 రాష్ట్రాలలో 211  జిల్లాలలో కోవిడ్-19 కేసులు నమోదు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా పలు ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం చాలా ఎక్కువుగా ఉంది. చివరి “కోవిడ్-19” కేసు నమోదైన తర్వాత, 4 వారాల వరకు మరలా కొత్తగా ఏలాంటి “పాజిటివ్” కేసు నమోదు కానట్లయుతే, అప్పుడు మాత్రమే ఆయా ప్రాంతాలలో అమలులో ఉన్న ఈ “బృహత్తర ప్రణాళిక”ను నెమ్మదిగా సడలించాలని నిర్ణయం.
 
ప్రస్తుతం “పాజిటివ్” కేసులు నమోదైన ప్రాంతాలలో జనసంచారం లేకుండా చేయడం, ఆయా ప్రాంతాలకు పూర్తిగా రాకపోకలను రద్దు చేయడం. “పాజిటివ్” కేసులుగా నమోదైన వారినందరినీ ఆసుపత్రులకు తరలించి, అక్కడ విడిగా ప్రత్యేకమైన “ఐసొలేషన్” వార్డులలో ఉంచాలి. 
 
రెండు సార్లు జరిపే రక్త పరీక్షలు “నెగటివ్”గా వస్తేనే పేషెంట్లను ఆసుపత్రుల నుంచి ఇళ్లకు పంపాలి. కొద్దిపాటి రోగ లక్షణాలు ఉన్న వాళ్లను స్టేడియంలలో ఏర్పాటు చేసిన “క్వారెంటైన్” కేంద్రాలకు పంపాలి. కొంచెం ఎక్కువ రోగ లక్షణాలు ఉన్నవాళ్లను అసుపత్రులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన “కోవిడ్-19” వార్డులలో ఉంచాలి. ప్రమాదకర రోగ లక్షణాలు ఉన్న వాళ్లను అధునాతన ఆసుపత్రులకు తరలించాలన్నది నిర్ణయం. 
 
అదేవిధంగా, “కరోనా” కేసులు నమోదైన ప్రాంతాలను దిగ్బంధం చేయడంతో పాటు, ఆ ప్రాంతాల నుంచి పక్క ప్రాంతాలకు “కరోనా” వ్యాప్తి చెందకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో అంచెల వారి  రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలి. పాఠశాలలు, కళాశాలలు, ఇతర కార్యాలయాలను చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా మూసివేయాలి. ఈ ప్రాంతాలలో ప్రభుత్వ, ప్రైవేట్ రవాణాను స్తంభింప చేయాలి. కేవలం నిత్యావసర, అత్యవసర సర్వీసులను మాత్రం అనుమతించాలి. 
 
ఓ పద్దతి ప్రకారం, అన్ని ప్రాంతాలలో ఒకే రకంగా “కరోనా” మహమ్మారి వ్యాప్తి చెందే అవకాశం లేదు. కాబట్టి, “కరోనా” వ్యాప్తిని కట్టడి చేయాలంటే దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ విధానాలను అవలంభించాల్సి ఉంటుందని కేంద్రం రూపొందించిన ప్రణాళిక స్పష్టం చేసింది. 
 
వైద్య సిబ్బంది, డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, కట్టుదిట్టమైన సర్జికల్ గౌనులు, మాస్కులు, గ్లోవ్స్ లాంటి మూడు రకాలైన (మూడు పొరలు) వ్యక్తిగత సంరక్షణ పరికరాలు వినియోగించాలి. “కరోనా”పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను “హాట్ స్పాట్లు”గా గుర్తించి, చాలా ఖచ్చితమైన చర్యలు తీసుకునే బాధ్యతను సంబంధిత జిల్లా మెజిస్ట్రేట్లకు అప్పగించాలని నిర్ణయం.