గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (10:45 IST)

సామాన్యుడిని పెళ్లి చేసుకున్న జపాన్ యువరాణి

సామాన్యుడిని పెండ్లి చేసుకోనున్నట్టు జపాన్‌ యువరాణి మకో ఇప్పటికే ప్రకటించారు. ఆమె ప్రకటించినట్టుగానే తాజాగా తన మూడేండ్ల ప్రేమకు గెలుపుతో ముగింపు పలికారు. సామాన్యుడైన కీ కొమురోతో జపాన్‌ యువరాణి మకో వివాహం ఘనంగా జరిగింది. ఈ మేరకు జపాన్‌ రాజసౌధం ఇంపీరియల్‌ హౌస్‌హోల్డ్‌ ఏజెన్సీ తెలిపింది. 
 
యువరాణి మకో.. భర్త ఇంటిపేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నట్టు వివరించింది. అలాగే, రాజభరణం కింద తనకు వచ్చే రూ.9.19 కోట్లు (140 మిలియన్‌ యెన్‌లు) మొత్తాన్ని కూడా తిరస్కరించినట్టు తెలిపింది. అలాగే, ఒక సాధారణ పౌరుడిని పెళ్ళి చేసుకోవడంతో మకో యువరాణి హోదాను కోల్పోయి సామాన్య పౌరురాలిగా మారిపోయారు. 
 
కాగా, జపాన్‌ చక్రవర్తి నరుహిటో సోదరుడి కుమార్తె మకో. టోక్యో ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ యూనివర్శిటీలో చదువుకునే సమయంలో ఆమె కొమురోను ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోబోతున్నట్టు 2017లోనే ఈ జంట ప్రకటించినప్పటికీ.. కుటుంబ, ఆర్థిక సమస్యల కారణంగా ముందుకు వెళ్లలేదు. తాజాగా ఇరు కుటుంబాలు అంగీకరించడంతో ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.