బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (16:54 IST)

భారతీయ టెక్కీలకు హెచ్1బి వీసాలు ఇవ్వొద్దు : ఇమిగ్రేషన్ వాయిస్ వినతి

భారతీయ టెక్కీలకు హెచ్1బి వీసాలు జారీచేయొద్దని ప్రముఖ ఇమిగ్రేషన్ అనే స్వచ్చంధ సంస్థ కోరింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వానికి ఓ వినతి పత్రం కూడా ఆ సంస్థ ప్రతినిధులు సమర్పించారు. ప్రస్తుతం శాశ్వత నివాస హోదానిచ్చే గ్రీన్ కార్డులపై పరిమితిని ఎత్తేసేదాకా భారతీయులకు కొత్తగా హెచ్1బీ వీసాలను మంజూరు చేయొద్దని కోరింది. 
 
ఈ సంస్థ అమెరికాలో ఉన్న భారతీయ అమెరికన్లకు మద్దతుగా నిలుస్తున్న ఇమిగ్రేషన్ వాయిస్ సంస్థలో లక్షా 30 వేల మంది భారతీయులు సభ్యులుగా ఉన్నారు. అందులో డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, వ్యాపారవేత్తల వంటి వారున్నారు. అమెరికాలో ఉద్యోగం చేసే భారతీయుల హక్కులపై సంస్థ పోరాడుతోంది.
 
ముఖ్యంగా, గ్రీన్ కార్డులపై పరిమితి పెట్టడం వల్ల చాలా మంది వాటి కోసం దశాబ్దాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులున్నాయని, మళ్లీ కొత్తగా హెచ్1బీ వీసాలిస్తే ఆ జాబితాలో మరికొన్ని వేల మంది చేరిపోతారని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. 
 
మార్చి 9 నుంచి ఆన్‌లైన్‌లో వీసాల దరఖాస్తుకు బైడెన్ అనుమతులిచ్చిన నేపథ్యంలో సంస్థ ఈ విధంగా స్పందించింది. ఇప్పుడు కొత్తగా వీసాలు ఇవ్వడం వల్ల కొత్తగా 60 వేల మంది అనుకోకుండానే గ్రీన్ కార్డులకు బాధితులవ్వాల్సి వస్తుందని సంస్థ అధ్యక్షుడు అమన్ కపూర్ పేర్కొన్నారు. 
 
గ్రీన్ కార్డుల విషయాన్ని తేల్చకుండా ఎప్పటికప్పుడు హెచ్1బీ వీసాలను జారీ చేస్తూ పోతే.. కంపెనీల దయాదాక్షిణ్యాలమీదే ఉద్యోగి, వారి కుటుంబ సభ్యులు బతకాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. దాని వల్ల భవిష్యత్తులో నష్టం జరుగుతుందన్నారు.