తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన... భారతీయ ప్రయాణికుడి అరెస్టు
అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఒక భారతీయ ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో తోటి ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగాడు. అంతటి ఆగకుండా అతనిపై మూత్ర విసర్జన చేశాడు. దీనిపై ఎయిర్ లైన్స్ సిబ్బంది ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విమానం ల్యాండ్ కాగానే ఆ ప్రయాణికుడిని అరెస్టు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు.
న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన విమాన సిబ్బంది తొలుత ఇతర ప్రయాణికులు వాంగ్మూలాన్ని తీసుకుని, ఆపై ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత విమానం ఢిల్లీలో ల్యాండ్ కాగానే, సీఐఎస్ఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సివిల్ ఏవియేషన్ చట్టం కింద నిందితుడిపై చర్యలు ప్రారంభించామని ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, బాధితుడు మినహా అతడిపై ఇతర ప్రయాణికులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.
కాగా, ఇటీవలికాలంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇది మూడోసారి. గత యేడాది నవంబరు 26వ తేదీన న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు 70 యేళ్ల తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఆ తర్వాత డిసెంబరు 26వ తేదీన ప్యారీస్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలి సీటుపై మూత్ర విసర్జన చేశాడు.