కరోనా బాధితుల్లో మృతులంతా వ్యాక్సిన్ వేయించుకోనివారే...
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారినపడకుండా ఉండాలన్నా, ఒకవేళ సోకినా మృత్యువాతపడకుండా ఉండాలన్నా ఏకైక ఆయుధం కరోనా వ్యాక్సిన్ అని వైద్య నిపుణులు పదేపదే చెబుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇపుడు ఇదే విషయాన్ని బహిర్గతం చేసింది. అమెరికా సంభవించిన కోవిడ్ బాధితుల మృతుల్లో 99 శాతం మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకోని వారేనని తాజాగా వెల్లడించింది.
గత నెల (మే)లో అమెరికాలో మరణించిన కరోనా బాధితుల్లో 99.2 శాతం మంది వ్యాక్సిన్లు పొందనివారేనని తాజా నివేదిక సూచిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డేటాను విశ్లేషించినప్పుడు ఇది వెల్లడైంది.
మే నెలలో అమెరికాలో 18వేలకు పైగా కొవిడ్ మరణాలు చోటుచేసుకున్నాయని, అందులో పూర్తిస్థాయిలో టీకా పొందినవారు 150 మంది మాత్రమే ఉన్నారని సదరు నివేదిక పేర్కొంది. బాధితులు ఆసుపత్రిపాలు కాకుండా చూడటంలోనూ వ్యాక్సిన్లు ఉపయోగపడ్డాయని తెలిపింది.
గత నెలలో 8,53,000 మంది కరోనాతో ఆసుపత్రుల్లో చేరగా.. వారిలో 1200 మంది మాత్రమే పూర్తిస్థాయిలో టీకాలు పొందినవారు ఉన్నారని వివరించింది. దీన్నిబట్టి కొవిడ్ మరణాలను పూర్తిగా నివారించడం సాధ్యమేనని స్పష్టమవుతున్నట్లు సీడీసీ డైరెక్టర్ రోషెల్ వాలెన్‌స్కీ పేర్కొన్నారు.