శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్ దళవాయి
Last Modified: బుధవారం, 20 మార్చి 2019 (19:02 IST)

నెలకు రూ. 15 లక్షల అద్దె చెల్లిస్తూ దర్జాగా లండన్‌లో నీరవ్ మోదీ... పట్టేశారు...

భారత్‌లో వేలకోట్ల రూపాయలు అప్పుచేసి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీని లండన్‌లో అరెస్ట్ చేసారు. ఇందుకు సంబంధించిన వివరాలను బ్రిటిష్ వార్తాపత్రిక 'ది టెలిగ్రాఫ్' వెల్లడించింది. నీరవ్ మోదీ లండన్‌లోని సెంటర్ పాయింట్ టవర్ క్లాక్‌లో మూడు పడక గదుల నివాసంలో నెలకు 17 పౌండ్లు (రూ. 15 లక్షలు) చెల్లించి నివాసం ఉంటున్నాడని పేర్కొంది. ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న సాహోలో వజ్రాల వ్యాపారాన్ని కూడా ప్రారంభించినట్లు ఆ పత్రిక తెలిపింది.
 
నీరవ్ మోదీ లండన్‌లోని హోల్ బెర్న్ మెట్రో స్టేషన్‌లో ఉండగా లండన్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఈరోజు సంబంధిత న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ది టెలిగ్రాఫ్ వెల్లడించింది. భారత్‌లో నీరవ్ మోదీ కేసును సీబీఐ మరియు ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. 
 
నీరవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుని తిరిగి అతడిని భారత్‌కు రప్పించేందుకు మార్గం సుగమం చేయాలని కోరుతూ లండన్‌లోని హోమ్ శాఖ కార్యాలయానికి ఈడీ లేఖ రాసింది. ఈ లేఖను పరిగణనలోకి తీసుకున్న లండన్ న్యాయస్థానం నీరవ్ మోదీపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే చట్టపరమైన చర్యల తర్వాత నీరవ్‌ను భారత్‌కు అప్పగించే కార్యక్రమం మొదలవుతుందని అధికారులు తెలిపారు.