లండన్‌లో నీరవ్ మోడీ రాజవైభోగం ... రూ.73 కోట్ల విలువైన ఫ్లాట్
దేశంలోని పలు బ్యాంకు నుంచి కోట్లాది రూపాయల మేరకు రుణాలు తీసుకుని వాటిని చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ లండన్‌లో రాజవైభోగం అనుభవిస్తున్నాడు. లండన్‌లోని అత్యంత విలాసవంతమైన ప్రాంతంలో రూ.73 కోట్ల విలువైన ఫ్లాట్.. అందులో నెలకు రూ.15 లక్షల అద్దెతో మూడు పడక గదుల ఇంటిలో జీవితాన్ని అనుభవిస్తున్నాడు.
పైగా, తన వంటిపై రూ.9 లక్షల విలువైన ఆస్ట్రిచ్ జాకెట్.. మణికట్టుకు ఖరీదైన బంగారు బ్రాస్‌లెట్‌లు ధరించి, కోర మీసాలు, గడ్డంతో తన ఆహార్యాన్ని పూర్తిగా మార్చుకుని లండన్ వీధుల్లో దర్జాగా, స్వేచ్ఛగా సంచరిస్తున్నాడు. భూమి లోపల తలపెట్టి ఎవరికీ కనిపించడం లేదని భావించే ఉష్ణపక్షి (ఆస్ట్రిచ్)లా భారత్‌కు దూరంగా లండన్‌లో తలదాచుకుందామనుకున్న నీరవ్ మోడీ డైలీ టెలిగ్రాఫ్ పత్రిక ప్రతినిధులకు దొరికిపోయి అడ్డంగా బుక్కయ్యాడు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)ను రూ.13,500 కోట్ల మేర మోసగించినట్టు నీరవ్ మోడీ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఈయన విదేశాలకు పారిపోయి లండన్‌లోని అత్యంత విలాసవంత ప్రాంతమైన వెస్ట్ ఎండ్‌లో నివాసం ఉంటున్నాడు. అలాగే తన ఇంటికి అత్యంత సమీపంలోని సోహో ప్రాంతంలో కొత్తగా వజ్రాల వ్యాపారాన్ని సైతం ప్రారంభించాడు.
ప్రతి రోజు ఇంటి నుంచి కాలినడకన తన కుక్కతో కలిసి నడుచుకుంటూ వజ్రాల దుకాణానికి వెళుతున్నాడు. ఈ మేరకు నీరవ్‌మోదీ తాజా సంగతుల్ని డైలీ టెలిగ్రాఫ్ పూసగుచ్చినట్లుగా వివరించింది. తనను ఎవరూ గుర్తుపట్టకుండా నీరవ్ తన ఆహార్యాన్ని పూర్తిగా మార్చేశాడు. ఎప్పుడూ నీట్ షేవ్‌తో కనిపించే ఆయన పూర్తిగా కోర మీసాలు, గడ్డంతో కొత్త వేషంతో బయటపడ్డారు.
అంతేకాకుండా, యూకేలో వ్యాపారం చేసుకునేందుకు మోడీ దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకు యూకేలోని వర్క్ అండ్ పెన్షన్ విభాగం ఆయనకు నేషనల్ ఇన్సూరెన్స్ నంబర్‌ను జారీచేసింది. దీని ప్రకారం బ్రిటన్‌లో అతడు చట్టబద్ధంగా వ్యాపారం చేసుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్ బ్యాంకు లావాదేవీలు కొనసాగించవచ్చు. వజ్రాలు, చేతి గడియారాల వ్యాపారంలో హోల్‌సేల్ ట్రేడర్‌గా, రిటైలర్‌గా నీరవ్ మోడీ రంగంలోకి దిగాడు. అయితే, కొత్త వ్యాపారంలో డైరెక్టర్‌గా ఎక్కడా తన పేరును మాత్రం ఆయన పేర్కొనకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.