గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 జులై 2020 (11:32 IST)

దక్షిణ కొరియా నుంచి ఉత్తర కొరియాకు కరోనా.. కిమ్ సీరియస్..

ఉత్తర కొరియాలో కరోనా వైరస్ నమోదు కావడం మొదలైంది. దీంతో ఉత్తర కొరియా అప్రమత్తత చర్యలు చేపట్టింది. దక్షిణ కొరియా నుంచి వచ్చిన వ్యక్తి వల్లే దేశంలోకి ఈ వైరస్‌ చొరబడినట్లు అక్కడి ప్రభుత్వ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. మూడేళ్ల క్రితం దక్షిణ కొరియాకు పారిపోయిన వ్యక్తి ఇటీవల దేశానికి తిరిగి వచ్చాడని.. అతనిలో వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు పేర్కొంది.
 
దీంతో దేశాధినేత కిమ్‌జోంగ్‌ ఉన్‌ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం సరిహద్దుల్లోని కైసాంగ్‌ నగరంలో లాక్‌డౌన్‌ విధించారు. ''సరిహద్దుల్లోని కైసాంగ్‌ నగరంలో అనుకోని ఘటన జరిగింది. మూడేళ్ల క్రితం దేశం నుంచి దక్షిణ కొరియాకు పారిపోయిన వ్యక్తి జులై 19 తిరిగి వచ్చాడు. అతనిలో కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నాయి. అతను అక్రమంగా దేశ సరిహద్దులు దాటాడు'' అని కేసీఎన్‌ఏ పేర్కొంది.
 
ఇటీవలే వైరస్‌పై విజయం సాధించామని ప్రకటించిన కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు తాజా ఘటన ఆగ్రహం తెప్పించింది. వీలైనన్ని అత్యవసర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అసలు ఆ వ్యక్తి సరిహద్దులు ఎలా దాటాడో కనుగొనాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు కారకులపై కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.