బుధవారం, 12 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 మార్చి 2025 (10:06 IST)

పాక్‌లో రైలు హైజాక్ ... 16 మంది రెబల్స్ కాల్చివేత... కొందరు బందీలకు విముక్తి

pak train
పాకిస్థాన్ దేశంలోని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్లు మంగళవారం జఫ్పార్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసి, అందులోని ప్రయాణికులను బందీలుగా పట్టుకున్న విషయం తెల్సిందే. దీంతో రంగంలోకి దిగిన పాకిస్థాన్ ఆర్మీ బలగాలు.. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి 16 మంది మిలిటెంట్లను కాల్చివేసింది. బందీలుగా ఉన్న వారిలో 100మందికిపైగా ప్రయాణికులను రక్షించింది. వీరిలో 58 మంది పురుషులు, 31 మంది మహిళలు, 15 మంది చిన్నారులు ఉన్నారు. బీఎల్ఏ మిలిటెంట్లు, పాక్ సైనిక బలగాలకు మధ్య మంగళవారం రాత్రి నుంచి భీకర పోరు సాగుతోంది. మరోవైపు, పాక్ సైనికుల్లో 30 మందిని హతమార్చినట్టు బీఎల్ఏ మిలిటెంట్లు ప్రటించారు. దీనిపై పాక్ ఆర్మీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 
 
క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్ నగారానికి వెళుతున్న జఫ్పార్ ఎక్స్‌ప్రెస్ రైలును బీఎల్ఏ మిలిటెంట్లు దాడి చేసి హైజాక్ చేశారు. ఈ రైలులోని తొమ్మిది బోగీల్లో ఉన్న ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. ఈ రైలు ప్రయాణించే మార్గంలో 17 సొరంగాలు ఉండగా, ఎనిమిదో సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్ పేల్చివేసి రైలును తమ నియంత్రణలోకి తీసుకుని, రైలును చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో లోకో పైలెట్ సహా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. 
 
ఈ సమాచారం తెలుసుకున్న భద్రతా బలగాలు రంగంలోకి దిగి 104 మంది ప్రయాణికులను రక్షించాయి. వీరిలో 58 మంది పురుషులు, 31 మంది మహిళలు, 15 మంది చిన్నారులు ఉన్నారు. మంగళవారం రాత్రి నుంచి బలూచిస్థాన్ రెబెల్స్, పాకిస్థాన్ దళాల మధ్య భీకరపోరు కొనసాగుతుంది. తమవైపు నుంచి ఎలాంటి నష్టం జరగలేదని, 30 మంది సైనికులను హతమార్చినట్టు బీఎల్ఏ రెబెల్స్ ప్రకటించారు. అయితే, ఈ విషయాన్ని పాక్ సైనిక అధికారులు నిర్ధారించలేదు.