నెపోలియన్ ఆత్మహత్య చేసుకునేందుకు ఉపయోగించిన పిస్తోళ్లకు భారీ ధర!!
ఫ్రాన్స్ సైన్యాధ్యక్షుడు, రాజకీయనేత నెపోలియన్ అలియాస్ నెపోలియన్ బోనపార్టే ఆత్మహత్య చేసుకునేందుకు ఉపయోగించిన పిస్తోళ్లను వేలం వేయగా, ఇవి భారీ ధర పలికాయి. ఫ్రాన్స్‌లో నిర్వహించినచ వేలం పాటల్లో ఈ రెండు పిస్తోళ్లు ఏకంగా 1.69 మిలియన్ యూరోలు పలికాయి. అమెరికన్ డాలర్లలో 1.8 మిలియన్ డాలర్ల మేరకు ధర పలికింది. ఈ మేరకు ఈ పిస్తోళ్లకు వేలం పాటలు నిర్వహించిన ఓసేనాట్ ఆక్షన్ అనే కంపెనీ వెల్లడించింది. అయితే ఈ పిస్తోళ్లను కొనుగోలు చేసినవారి పేర్లను మాత్రం గోప్యంగా ఉంచింది. పారిస్‌లోని ఫాంటైన్ బ్లూలో వేలాన్ని ఆదివారం నిర్వహించారు.
అయితే, ఈ పిస్టోళ్లను వేలం వేయడానికి ముందు రోజు వీటిని దేశ సంపదగా ఫ్రాన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ కమిషన్ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ వస్తువులను జాతీయ సంపదగా వర్గీకరించామని, వాటిని విక్రయంపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో వేలం పాటలో దక్కించుకున్న వ్యక్తుల నుంచి ఈ పిస్టోళ్లను ఫ్రాన్స్ ప్రభుత్వం తిరిగి దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
30 నెలల వ్యవధిలో పిస్టోళ్లను తిరిగి కొనుగోలు చేయవచ్చు. సదరు వ్యక్తి నుంచి దక్కించుకునేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కొనుగోలు ఆఫర్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఈ ఆఫర్‌ను తిరస్కరించే హక్కు వేలంలో దక్కించుకున్న వ్యక్తికి ఉంటుంది. కాగా దేశ సంపదగా ప్రకటించిన ఏ వస్తువునైనా తాత్కాలికంగా మాత్రమే ఫ్రాన్స్ వెలుపలకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని ఆ దేశ నిబంధనలు చెబుతున్నాయి. ఆ తర్వాత తప్పనిసరిగా తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని 'ఒసేనాట్ ఆక్షన్' ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
ఈ రెండు పిస్టోళ్లను బంగారం, వెండితో తయారు చేశారు. ఈ రెండు తుపాకులు సామ్రాజ్య వైభవంతో కనిపిస్తున్నాయి. 1814లో విదేశీ సైన్యం పారిస్‌ను ఆక్రమించుకోవడంతో నెపోలియన్ అధికారాన్ని వదులుకోవాల్సి వచ్చింది. తీవ్ర నిరాశ, ఒత్తిడికి లోనైన ఆయన ఈ తుపాకీలతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. అయితే భూస్వామి ఒకరు తుపాకీలోని పౌడర్‌ను తొలగించారని వేలం సంస్థ నిపుణుడు జీన్-పియర్ ఒసేనాట్ వెల్లడించారు. తుపాకీ పనిచేయకపోవడంతో నెపోలియన్ విషం తాగారని, అయితే వాంతి కావడంతో ప్రాణాలతో బయటపడ్డారని, తన పట్ల విధేయత చూపిన ఆ భూస్వామికి ఈ పిస్టోళ్లను బహుమతిగా అందించారని వివరించారు.